ఎలన్‌ మస్క్‌ తర్వాత సింగ్‌ ఈజ్‌ ‘కింగ్‌’ అవుతాడా?

16 Dec, 2021 14:24 IST|Sakshi

Quantumscape CEO Jagdeep Singh: సాధారణంగా కంపెనీల సీఈవోలు తమ సేవలకు నెలవారీ లేదంటే ఏడాదికి ప్యాకేజీ జీతాలను అందుకోవడం కామన్‌. కానీ, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ మాత్రం వెరైటీగా ‘జీరో శాలరీ’తో షేర్ల ద్వారా తన బిలియన్‌ డాలర్ల దాహం తీర్చుకుంటున్నాడు. అయితే ఈ లిస్ట్‌లో ఇప్పుడు భారీ ప్యాకేజీ అందుకునేందుకు భారత సంతతికి చెందిన  ఓ సీఈవో సిద్ధంగా ఉన్నాడు. 


అమెరికన్‌ స్టార్టప్‌ క్వాంటమ్‌స్కేప్‌ కార్పొరేషన్‌.. కార్లలో ఉపయోగించే లిథియమ్‌ మెటల్‌ బ్యాటరీలపై పరిశోధనలు నిర్వహించే కంపెనీ. 2010లో కాలిఫోర్నియా, శాన్‌ జోన్స్‌ బేస్డ్‌గా ఇది కార్యకలాపాలను నిర్వహిస్తోంది.  ఇందులో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, వోగ్స్‌వాగన్‌ లాంటి కంపెనీల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈ కంపెనీకి వ్యవస్థాపకుడు(మరో ఇద్దరితో కలిసి), సీఈవోగా ఉంది భారత సంతతికి చెందిన జగ్దీప్‌ సింగ్‌. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్లు విపరీతమైన లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి కూడా.

కిందటి ఏడాది బ్లాంక్‌ చెక్‌తో ఐపీవోకి వెళ్లిన క్వాంటమ్‌స్కేప్‌.. 50 బిలియన్ల విలువతో మల్టీబిలియన్‌ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఒప్పందం ప్రకారం.. సీఈవో జగ్దీప్‌ సింగ్‌కు ఏకంగా 2.3 బిలియన్‌ డాలర్లు విలువ చేసే(మన కరెన్సీలో 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది) షేర్లను కట్టబెట్టాలని నిర్ణయించుకుంది క్వాంటమ్‌స్కేప్‌ బోర్డు. కానీ, నిర్ణీత సమయంలో లక్క్ష్యం అందుకోవడం, కొన్ని మైళ్లు రాళ్లను దాటడం పూర్తి చేస్తేనే ఆయనకి ఈ విలువైన షేర్లు దక్కనున్నాయట. 

బుధవారం జరిగిన షేర్‌హోల్డర్‌ సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు అడ్వైజరీ కంపెనీ గ్లాస్‌ లూయిస్‌ చెప్తోంది. తొలుత ఈ ప్రతిపాదనకు వాటాదారులు ఒప్పుకోనప్పటికీ.. జగ్దీప్‌ సింగ్‌పై పూర్తి నమ్మకం కంపెనీ ప్రదర్శించడంతో షేర్‌హోల్డర్స్‌కు అంగీకరించారని,  చివరకు డీల్‌ కుదిరిందనేది గ్లాస్‌ లూయిస్‌ సారాంశం. అదే జరిగితే టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ తర్వాత కేవలం వాటాల ద్వారానే అంతేసి లాభాలు అందుకునే రెండో సీఈవోగా జగ్దీప్‌ సింగ్‌ పేరు కార్పొరేట్‌ రంగంలో నిలిచిపోవడం ఖాయం.

చదవండి: మరో సంచలనానికి సిద్దమైన ఎలన్‌ మస్క్‌..!

మరిన్ని వార్తలు