హృదయవిదారకం.. సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం దుర్మరణం!

1 Apr, 2023 07:41 IST|Sakshi

న్యూయార్క్‌/ఒట్టావా: కెనడా-అమెరికా సరిహద్దులో విషాదం చోటుచేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటే క్రమంలో ఆరుగురు శరణార్థులు దుర్మరణం పాలయ్యారు. వీళ్లలో ఐదుగురు భారత్‌కు చెందినవాళ్లూ, అదీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తిని కెనడా పౌరసత్వం ఉన్న రోమేనియన్‌గా కెనడా పోలీసులు గుర్తించారు. 

ఇరు దేశాల మధ్య అక్వెసాస్నేలోని మోహవ్క్‌ సరిహద్దు-క్యూబెక్‌(న్యూయార్క్‌ స్టేట్‌) ప్రాంతంలో సెయింట్‌ లారెన్స్‌ నదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు అంతా భారతీయులేనా? అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం నదీ తీర ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఓ బోటును అధికారులు గుర్తించారు. ఆపై ఏరియల్‌ సర్వే ద్వారా  మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలికితీశారు. మరో చిన్నారికి చెందిన పాస్‌పోర్ట్‌ లభ్యం కాగా ఆమె కూడా చనిపోయి ఉంటుందని అంచనాకి వచ్చిన పోలీసులు.. మృతదేహం కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.  

ఇది హృదయవిదారకమైన ఘటన. మృతుల్లో పసికందులు కూడా ఉండడం ఘోరం అని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందించారు. 

ఇక జనవరి నుంచి ఇప్పటిదాకా అక్రమంగా ఇరు దేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు 48 వెలుగు చూసినట్లు అక్వెసాస్నే అధికారులు చెబుతున్నారు. వీళ్లలో భారత్‌కు, రొమేనియాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. మోహవ్క్‌ సరిహద్దు ప్రాంతంలో ఉండే అక్వెసాస్నే.. క్యూబెక్‌, ఒంటారియో, న్యూయార్క్‌ స్టేట్‌లతో సరిహద్దు పంచుకుంటోంది. అందుకే వీటి గుండా ఇరు దేశాలకు శరణార్థుల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటోంది. పైగా ఈ అక్రమ రవాణాకు పోలీసులే సహకరిస్తుండడం గమనార్హం. సరిహద్దుల్లో దిగాక.. వాళ్లకు గోప్యంగా వాహనాల్లో ఆయా ప్రాంతాలకు తరలిస్తుంటారు.

ఇదీ చదవండి: నాసా ‘మూన్‌ టు మార్స్‌’ చీఫ్‌గా మనోడు!

మరిన్ని వార్తలు