యూఏఈలో ఘ‌నంగా స్వ‌తంత్ర వేడుక‌లు

16 Aug, 2020 14:13 IST|Sakshi

అబుదాబీ: 74వ భార‌త‌ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఇండియా సోష‌ల్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో నిరాడంబ‌రంగా జ‌రిగాయి. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న వేళ యూఏఈ ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌ర‌మితమైన అనుమ‌తుల మేర‌కు ఐఎస్‌సీ యాజ‌మాన్యం మొత్తం వేడుక‌ల‌ను రెండు భాగాలుగా విభ‌జించి నిర్వ‌హించింది. ఉద‌యం 7.30 నిమిషాల‌కు ఐఎస్‌సీ యాజ‌మాన్య కార్య‌వ‌ర్గం, సెంట‌ర్ ఉద్యోగుల స‌మ‌క్షంలో ఐఎస్‌సీ అధ్య‌క్షుడు యోగేష్ ప్ర‌భు జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగ ఫ‌లిత‌మే మ‌నం అనుభ‌విస్తున్న ఈ స్వేచ్ఛ వాయువుల‌ని, అంద‌రం దేశ ప్ర‌గ‌తికి తోడ్ప‌డిన‌నాడే వారికి నిజ‌మైన నివాళి అర్పించిన‌వాళ్ల‌మ‌వుతామ‌ని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని సాంకేతిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తున్న సంఘ స‌భ్యులు, యూఎన్ఈలో ఉంటున్న ఎంతోమంది భార‌తీయులంద‌రికీ 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే క‌రోనా ప్ర‌భావం, ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తుల మేర‌కు ఇలా జ‌రుపుకోవాల్సి వ‌చ్చింద‌ని సంఘ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోజో అంబూకేన్ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో రెండో భాగ‌మైన సాంస్కృతిక కార్య‌క్ర‌మం సాయంత్రం 7.30 నిమిషాల నుంచి రెండు గంట‌లపాటు జ‌రుపుకున్నార‌ని సాంస్కృతిక కార్య‌ద‌ర్శి జ‌య‌ప్ర‌దీప్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 10 రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల పాలు పంచుకున్నాయని ద‌క్షిణ భార‌త కార్య‌ద‌ర్శి రాజా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో తెలుగు వారి త‌ర‌పున పావ‌ని ఆధ్వ‌ర్యంలో వ‌ర్షిణి, ఆముక్త‌, కువీర‌, సంస్కృతి, అక్ష‌ర‌, క‌వీష్‌, అభిరామ్ పాల్గొని ప్రేక్ష‌కుల‌ను వారి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. తెలుగు వారి ప్ర‌ద‌ర్శ‌న ఈ కార్య‌క్ర‌మానికే వ‌న్నె తెచ్చింద‌ని ఉపాధ్య‌క్షులు జార్జి వ‌ర్గీస్ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని జూమ్ ద్వారా యూఏఈలో ఉన్న ఎంద‌రో భార‌తీయులు వీక్షించార‌ని సెంట‌ర్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ రాజు అన్నారు. అలాగే భార‌త దౌత్య కార్యాల‌యం 74వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జ‌రిపిన ఆన్‌లైన్ దేశ భ‌క్తి గీతాల‌, చిత్ర లేఖ‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో క‌వీష్ పాడిన పాట‌ను కాన్సులేట్ జ‌న‌ర‌ల్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి స‌హ‌క‌రించిన తెలుగు మిత్రులు, వారి కుటుంబ స‌భ్యులంద‌రికీ రాజా శ్రీనివాస‌రావు ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.


 


 


 

మరిన్ని వార్తలు