ఎన్నారైలకు శుభవార్త ! రెమిటెన్సులు ఇకపై సులభం

28 Dec, 2021 08:33 IST|Sakshi

భారతీయులకు మరింత తేలిగ్గా రెమిటెన్సులు 

ఎన్‌పీసీఐతో ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌ భాగస్వామ్యం

యూపీఐ ఐడీల వినియోగంతో నగదు బదిలీ   

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి భారతీయులు ఇక మరింత సులభంగా డబ్బును అందుకునే (రెమిటెన్సులు) వెసులుబాటు ఏర్పడింది. లబ్ధిదారుల యూపీఐ ఐడీలను ఉపయోగించడం ద్వారా సరిహద్దు నగదు బదిలీని సులభతరం చేయడానికి ఉద్దేశించి ఎన్‌పీసీఐతో (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు బ్యాంక్‌ ఒక ప్రకటన చేసింది. తాజా చొరవతో రెమిటెన్సులు లేదా ఎన్‌ఆర్‌ఐ చెల్లింపుల కోసం యూపీఐ ఐడీని వినియోగంలోకి తీసుకువస్తున్న తొలి భారతీయ బ్యాంక్‌గా ఇండస్‌ఇండ్‌ నిలవనుందని ప్రకటన వివరించింది. ఈ విధానం ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ ఆపరేటర్లు (ఎంటీఓ).. ఎన్‌పీసీఐ యూపీఐ చెల్లింపు వ్యవస్థలో అనుసంధానం కావడానికి, లబ్దిదారుల ఖాతాల్లోకి రెమిటెన్సుల చెల్లింపులకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ చానెల్‌ని వినియోగించుకుంటారు.  

థాయ్‌లాండ్‌తో ప్రారంభం 
థాయ్‌లాండ్‌తో తన తాజా రెమిటెన్సుల విధానాన్ని బ్యాంక్‌ ప్రారంభించింది. ఇందుకుగాను థాయ్‌లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్‌ సేవల సంస్థ– ‘డీమనీ’ సేవలను బ్యాంక్‌ వినియోగించుకోనుంది.  నగదు బదిలీ, విదేశీ కరెన్సీ మార్పిడికి సంబంధించి డీమనీ అత్యుత్తమ సేవలను అందిస్తోంది. డీమనీ వెబ్‌సైట్‌లో భారతదేశంలోని లబ్ధిదారుల యూపీఐ ఐడీలను జోడించి, విదేశాల్లోని భారతీయులు ఎవరైనా సులభంగా నిధులను బదిలీ చేయవచ్చు. డీమనీ తరహాలోనే వివిధ దేశాల్లోని అత్యుత్తమ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ పేర్కొంది. భారత్‌దేశంలోని లబ్దిదారుల బ్యాంక్‌ అకౌంట్ల వివరాలతో పనిలేకుండా కేవలం వారి యూపీఐ ఐడీలను యాడ్‌ (జోడించడం) చేసుకోవడం ద్వారా ఎన్‌ఆర్‌ఐలు తేలిగ్గా నిధుల బదలాయింపు జరపడంలో తమ చొరవ కీలకమైనదని ప్రకటనలో బ్యాంక్‌ హెడ్‌ (కన్జూమర్‌ బ్యాంకింగ్, మార్కెటింగ్‌) సౌమిత్ర సేన్‌ పేర్కొన్నారు. యూపీఐ వినియోగించే అంతర్జాతీయ పర్యాటకులకు తాజా ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయని ఎన్‌పీసీఐ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీన్‌ రాయ్‌ పేర్కొన్నారు. యూపీఐ ద్వారా రెమిటెన్సులకు సంబంధించి తాజా చొరవ గొప్ప ముందడుగని కూడా ఆయన వ్యాఖ్యానించారు.   

చదవండి: విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం

మరిన్ని వార్తలు