ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! మహా సర్కారు కొత్త నిబంధనలు

1 Dec, 2021 13:42 IST|Sakshi

ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయంతో అంతర్జాతీయ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులలో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయగా తాజాగా మహారాష్ట్ర సర్కారు మరికొన్నింటీని వాటికి జత చేసింది. 

ముంబై మీదుగా 
హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పోల్చితే ఢిల్లీ, ముంబైల నుంచి ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు ముంబై, ఢిల్లీల మీదుగా హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలకు విమానాల్లో చేరుకుంటుంటారు. అయితే ఒమిక్రాన్‌ నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్టులో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 

క్వారంటైన్‌ తప్పనిసరి
అట్‌ రిస్క్‌ జాబితాలో ఉన్న దేశాల నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకి చేరుకునే ప్రయాణికులు విధిగా ఏడు రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఆ తర్వాత రెండు, నాలుగు, ఏడో రోజున ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తారు. ఇక్కడ నెగటీవ్‌ వస్తే గమ్యస్థానాలకు చేరుకుని మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌ నిబంధనలు పాటించాలి. ఒక వేళ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. 

నెగటీవ్‌ ఉంటేనే
ఇక ముంబై నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో వెళ్లే ఎన్నారైలు, విదేశీయులు సైతం ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ నెగటీవ్‌ వస్తేనే కనెక్టింగ్‌ ఫ్లైట్‌కి అనుమతి ఇస్తారు. లేదంటే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి ముంబైకి వాయుమార్గంలో ప్రయాణం చేయాలన్నా ఆర్టీపీసీఆర్‌ టెస్టును తప్పనిసరి చేసింది మహా సర్కారు. 

కేంద్ర నిబంధనలు
అట్‌ రిస్క్‌ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోం క్వారంటైన్‌ని కేంద్రం విధించగా మహా సర్కాను ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ నిబంధన అమలు చేస్తోంది. దేశీయంగా చేసే ప్రయాణాలకు సైతం కోవిడ్‌ నెగటీవ్‌ రిపోర్టు తప్పనిసరిగా చేస్తూ నిబంధనలు రూపొందించింది.
 

చదవండి: ఒమిక్రాన్‌ భయం..డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌

మరిన్ని వార్తలు