Jaswinder Singh: పెట్రోల్‌పై డిస్కౌంట్‌! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు

13 Jun, 2022 11:54 IST|Sakshi

అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఫోనిక్స్‌లో నివసించే జస్విందర్‌ సింగ్‌ నిన్నా మొన్నటి వరకు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడతను అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. ఎంతో మంది అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం పని చేయడం ద్వారా అతని ఖ్యాతి ఎల్లలు దాటిందనే సందేహం వస్తోందా....

గడిచిన ఆరు నెలలుగా పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ - రష్యా వార్‌ మొదలైన తర్వాత అయితే ఆకాశమే హద్దుగా పెట్రోలు/డీజిల్‌ రేట్లు పెరిగాయ్‌. ప్రభుత్వాలు సైతం సబ్సిడీలు భరించలేక ప్రజల నెత్తినే భారం మోపాయి. కరోనా కష్టకాలం ఆ తర్వాత ఫ్యూయల్‌ రేట్ల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం రెక్కలు విప్పింది. ఉప్పు పప్పు మొదలు అన్నింటి ధరలు పెరిగాయ్‌.

డిస్కౌంట్‌లో పెట్రోల్‌
అరిజోనాలోని ఫోనిక్స్‌ దగ్గర జస్విందర్‌ సింగ్‌ ఓ పెట్రోల్‌పంప్‌ (గ్యాస్‌ స్టేషన్‌) నిర్వహిస్తున్నాడు. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో అన్ని వస్తువుల ధరలు పెరిగితే... జస్విందర్‌ బంకులో మాత్రం ప్యూయల్‌పై డిస్కౌంట్‌ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనాలో బ్యారెల్‌ ఫ్యూయల్‌ ధర 5.66 డాలర్లు ఉండగా జస్విందర్‌ ప్రతీ గ్యాలన్‌పై 47 సెంట్ల డిస్కౌంట్‌ ప్రకటించాడు.

నష్టాలు వచ్చినా
జస్విందర్‌ బంకులో ప్రతీరోజు సగటున వెయ్యి గ్యాలన్ల ఫ్యూయల్‌ అమ్ముడవుతోంది. ఈ లెక్కన ప్రతీరోజు బంకుకి 500 డాలర్ల (రూ.39 వేలు) వరకు నష్టం వస్తోంది. మార్చి నుంచి జస్విందర్‌ ఈ డిస్కౌంట్‌ ప్రకటించాడు. ఆ తర్వాత ఫ్యూయల్‌ రేట్లు పెరిగినా.. తన డిస్కౌంట్‌ ఆఫర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మొదట్లో ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌ అనుకున్నారు. కానీ ఫ్యూయల్‌ రేట్లు భగ్గుమంటున్నా నెలల తరబడి జస్విందర్‌ ఇచ్చిన మాట మీద నిలబడటంతో క్రమంగా అందరికీ జస్విందర్‌ నిజాయితీపై నమ్మకం పెరిగింది. అది అభిమానంగా మారింది.

అమ్మనాన్నల స్ఫూర్తితో
నష్టాలతో బంకును నిర్వహించడంపై ఎవరైనా జస్వంత్‌ని ప్రశ్నిస్తే... ‘ ఉన్నదాంట్లో పక్కవారికి సాయపడమంటూ మా అమ్మానాన్నలు నాకు నేర్పారు. నేను ఈ గ్యాస్‌ స్టేషన్‌ కారణంగానే జీవితంలో స్థిరపడ్డాను. పక్కవారికి సాయపడే స్థితిలో ఉన్నాను. అందుకే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి సాయంగా ఉండాలని ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను కొనసాగిస్తున్నాను’ అని తెలిపాడు జస్వంత్‌. 

సాహో జస్వంత్‌
మధ్యలో నష్టాలు అధికంగా వచ్చినప్పుడు గ్యాస్‌ స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న స్టోరులో జస్వంత్‌ సింగ్‌ అతని భార్య ఎక్కువ గంటలు పని చేయడం ద్వారా ఆ నష్టాన్ని భరించగలుగుతున్నట్టు జస్విందర్‌ తెలిపారు. వ్యాపారం అంటే లెక్కలు లాభాలే చూసుకునే రోజుల్లో తోటి వారికి సాయం చేసే తలంపుతో ముందుకు సాగుతున్న జస్విందర్‌ గురించి తెలుసుకున్న అమెరికన్లకే కాదు యావత్‌ లోకం హ్యాట్సాఫ్‌ చెబుతోంది. 

చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్‌ చేసిన బైడెన్‌

మరిన్ని వార్తలు