బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్‌.ఆర్‌.ఐ ఫౌండేషన్ భారీ విరాళం

17 Sep, 2022 20:56 IST|Sakshi

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా మూడవ సంవత్సరం ₹10 లక్షల విరాళాన్ని కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అందించింది. ప్రముఖ గాయని సునీత ఈ చెక్కును పాఠశాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మికి శనివారం సెప్టెంబర్ 17న అందజేశారు. అక్కడి విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామన్నారు. 

ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్నబాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు సునీత తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిధులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారం మరువలేనిదని ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు.

స్వయంకృషితో ఎదిగిన సునిత లాంటి కళాకారులు అందరికీ ఆదర్శమని ఆమె మరిన్ని విజయశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సత్య, పొదుపులక్ష్మీ ఐక్యసంఘంకు చెందిన పలువురు మహిళలు, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు