యూకే, యూరప్ దేశాలలో ముగిసిన దేవదేవుడి కల్యాణోత్సవాలు

18 Nov, 2022 17:19 IST|Sakshi

తాడేపల్లి: యూకే , యూరోప్ లలోని వివిధ దేశాలలో  ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై  ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. 

యూకే , యూరప్ దేశాలలో స్థిరపడిన  తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ  తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసాయి. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు  ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీవారి కళ్యాణోత్సవానికి అశేసంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది.

తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో బేసింగ్ స్టోక్-ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్  తెలుగు సంఘం, మాంచెస్టర్ - ఇంగ్లాండ్ లో శ్రీ వైకుంఠమ్, బెల్ఫాస్ట్ -నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ - ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్-స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్, ఐండ్ హోవెన్ - నెదర్లాండ్స్ లో SVK, నవంబర్ ౩వ తేదీన  జర్మనీ లోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్, 12వ తేదీన ఇంగ్లాండ్ లోని లండన్,  13 వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. ఈ 11 నగరాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా బస్సు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు.  

ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీవారి కళ్యాణానికి ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీమతి రీనత్ సంధు,  సత్య పినిశెట్టి, సెక్రటరీ (ఎకనామిక్స్ అండ్‌ కామర్స్)  బెల్జియం భారత రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు. అలాగే ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీలో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ పర్వతనేని హరీష్ దంపతులు, స్థానిక మేయర్  పాల్గొన్నారు.

ఇక పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. 11 నగరాలలోని  కల్యాణోత్సవాల్లో తెలుగు, భారతీయ భక్తులతో  పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. 

11 నగరాలలోని  కల్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసారు. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు, భారతీయ సంస్థలు ముందుకొస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని  మేడపాటి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని, దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు