అమెరికాలో ఖమ్మం యువకుడి మృతి కేసులో ట్విస్ట్!

7 Feb, 2023 21:24 IST|Sakshi

అమెరికాలో ఖమ్మం జిల్లాకు చెందిన మహంకాళి అఖిల్‌ సాయి మృతి ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. యూఎస్‌లో ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తూర్పు బీఎల్‌వీడి 3200 బ్లాక్‌కి చెందిన ఓ గ్యాస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్‌ గన్‌ను అఖిల్‌ సాయి పరిశీలిస్తుండగా అది కాస్త మిస్‌ ఫైర్‌ అయ్యింది. గన్‌ మిస్‌ ఫైర్‌ అవ్వడం.. ఆ బుల‍్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో యువకుడు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా గన్‌ మిస్‌ ఫైర్‌ కావడం వల్లే అఖిల్‌ సాయి చనిపోలేదని, తోటి తెలుగు విద్యార్ధి రవితేజ కాల్పులు జరపడంతో మృతి చెందినట్లు స్థానిక పోలీసులు జరిపిన ప్రాదమిక విచారణలో తేలింది. 

పోలీసుల కథనం ప్రకారం.. అఖిల్ సాయి ఉన్నత చదువు కోసం 13 నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. అమెరికాలోని అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో అఖిల్ చదువుకుంటున్నాడు. మరోవైపు ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే గ్యాస్ స్టేషన్ లో రవితేజ కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల అమెరికా వ్యాప్తంగా చాలా చోట్ల గ్యాస్ స్టేషన్ లలో క్రైమ్ పెరిగిపోవడంతో.. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్యాస్ స్టేషన్ లో పని చేసే ఉద్యోగులకు గన్ ఇస్తున్నారు. వీరు పని చేస్తున్న గ్యాస్ స్టేషన్ లోనూ దాని యాజమాన్యం ఓ గన్ ను వీరికి ఇచ్చింది. అత్యవసర సమయంలో గన్ ఎలా కాల్చాలి అన్న దానిపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. దీని కోసం గన్ లో ఉన్న బుల్లెట్లు అని తొలగించి అఖిల్ సాయి, రవితేజలకు ఇచ్చింది. కొంత సేపు గన్ ఎలా కాల్చాలి అన్నదానిపై శిక్షణ తీసుకున్న వీరిద్దరు.. తర్వాత బుల్లెట్లు లోడ్ చేయడం కూడా నేర్చుకున్నారు. తర్వాత బుల్లెట్లు తీసివేసి మరో సారి గురిపెట్టడం చేశారు. అయితే ఓ బుల్లెట్ పొరపాటున అందులోనే ఉండిపోయిందని, ఆ విషయం తెలియక రవితేజ ట్రిగ్గర్ నొక్కడంతో అఖిల్ సాయి మరణించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 

గ్యాస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న అఖిల్ సాయి, రవితేజ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలను కూడా ఇప్పటివరకు గమనించలేదని స్నేహితులు తెలిపినట్టు సమాచారం. అనూహ్యంగా తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్లే.. గాయాలయ్యాయని.. తల్లిదండ్రులకు సమాచారం అందింది.. ఆ తర్వాత చనిపోయాడని తెలిసింది. ఒక పొరపాటు నిండు ప్రాణాలు తీసేలా జరగడంతో రవితేజ వెంటనే 911కు సమాచారం అందించాడని, కొన ఊపిరితో ఉన్న రవితేజకు చికిత్స అందేలోగా చనిపోయాడని తెలిసింది. ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు