అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించిన ప్రవాసి సంఘం  

27 Mar, 2021 15:35 IST|Sakshi

గల్ఫ్ కార్మికుల వేతన భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించిన ప్రవాసి సంఘం

మంద భీంరెడ్డి 'పిల్' ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

వేతన తగ్గింపుతో పేదరికంలోకి జారిపోనున్న 88 లక్షల మంది భారతీయ గల్ఫ్ కార్మికులు

సాక్షి, హైదరాబాద్‌: గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జారీ చేసిన రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు  మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వేతనాలు తగ్గిస్తూ జారీచేసిన సర్క్యులర్లు రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసం, విచిత్రం, అహేతుకం, జీవించే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే విధంగా ఉన్నందున  ప్రేరేపించబడి జారీచేయబడ్డ ఆ సర్కులర్లను చెల్లుబాటు లేనివిగా (క్వాష్) ప్రకటించాలని పిటిషనర్ భీంరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. 

హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్‌సేన్‌ రెడ్డిల ధర్మాసనం కేసును గురువారం విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి కేసు వాదించారు. భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి, హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం 29 జులై కి వాయిదా వేశారు. ఇలాంటి మరొక కేసును కలిపి విచారించనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ తగ్గించిన కనీస వేతనాల వలన గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం పడుతుందని, వారు మరింత పేదరికంలోకి జారిపోనున్నారన్నారు. గత మూడు నెలలుగా గల్ఫ్ కార్మిక సంఘాలు పాత వేతనాలను కొనసాగించాలని, కనీస వేతనాలను తగ్గిస్తూ జారీచేసిన సర్క్యులర్లను రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల గల్ఫ్ జేఏసీ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎంపీలు, కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారని, కేంద్రం ఈ విషయాన్ని మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సెప్టెంబర్ 2020 లో సర్క్యులర్ల జారీ కంటే ముందు... బహ్రెయిన్‌ లో కనీస వేతనాలు హెల్పర్ కు 318 డాలర్లు, ఫోర్‌మాన్ కు 662 డాలర్లు, ఒమాన్‌ లో క్లినర్ కు 208 డాలర్లు, ఫోర్‌మాన్ కు 520 డాలర్లు, యుఏఇ లో క్లినర్ కు 259 డాలర్లు, హెవీ డ్రైవర్‌కు 637 డాలర్లు కనీస వేతనాలుగా ఉండేవి. అందరినీ ఒకేగాటన కట్టి అన్ని వృత్తులకు, అన్ని కేటగిరీల కార్మికులకు కనీస వేతనం 200 డాలర్లుగా తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేశారు. 

ఖతార్‌లో పనిచేసే అన్ని దేశాల కార్మికులకు ఎలాంటి వివక్ష లేకుండా కనీస వేతనం 1,000 రియాళ్ళు, అకామడేషన్ (వసతి)కి 500 రియాళ్ళు, భోజనానికి 300 రియాళ్ళు చెల్లించాలనే చట్టం 20 మార్చి 2021 నుండి అమలులోకి వచ్చింది. భారత ప్రభుత్వం మాత్రం తమ కార్మికులను 728 రియాళ్ళ కనీస వేతనానికి పంపిస్తామని సర్కులర్లు జారీ చేయడం ఆశ్చర్యకరమని మంద భీంరెడ్డి అన్నారు. తగ్గించిన వేతనాలతో గల్ఫ్ దేశాలలో కనీస జీవన ప్రమాణాలను కొనసాగించడం కష్టమని, సర్క్యులర్లత జారీ కంటే ముందు ఉన్న వేతనాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు.
చదవండి:
నాడు-నేడుకి తానా ఫౌండేషన్‌ రూ.50 లక్షల విరాళం
ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు