నబీలా సయ్యద్‌: యూఎస్‌ మధ్యంతర ఎన్నికల్లో ఇండో-అమెరికన్‌ సంచలనం

11 Nov, 2022 08:04 IST|Sakshi

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. ఎన్నో సంచలనాలకు నెలవుగా మారింది. అందులో భారత సంతతికి చెందిన పలువురు నెగ్గి.. హాట్‌ టాపిక్‌గా మారారు. ఇందులో రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌, అమీ బేరా ఉన్నారు. అయితే వీళ్లు కాకుండా నబీలా సయ్యద్ మాత్రం చరిత్ర సృష్టించింది. ఇల్లినాయిస్ స్టేట్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన..  అత్యంత పిన్నవయస్కురాలి ఘనత సాధించింది ఆమె. 

23 ఏళ్ల ఈ ఇండో-అమెరికన్‌.. రిపబ్లికన్‌ ప్రత్యర్థి క్రిస్‌ బాస్‌ను ఓడించింది. ఇల్లినాయిస్‌ స్టేట్‌లోని 51వ డిస్ట్రిక్‌ నుంచి పోటీ చేసిన ఆమె.. మొత్తం ఓట్లలో 52.3 శాతం ఓట్లకు దక్కించుకుంది. దీంతో తన ఆనందాన్ని ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది. 

నా పేరు నబీలా సయ్యద్‌. 23 ఏళ్ల వయసున్న ముస్లిం యువతిని. ఇండో-అమెరికన్‌ని. రిపబ్లికన్‌ పార్టీ ఆధీనంలో ఉన్న స్థానాన్ని మేం కైవసం చేసుకున్నాం. జనవరిలో ఇల్లినాయిస్‌ జనరల్‌ ​అసెంబ్లీలో చిన్నవయస్కురాలిగా అడుగుపెట్టబోతున్నాం. నన్ను గెలిపించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ జిల్లాలో ప్రతీ తలుపు తట్టాను. ఇప్పుడు గెలిచిన తర్వాత మరోసారి తట్టి.. వాళ్లకు కృతజ్ఞతలు చెబుతాను. రంగంలోకి దిగడానికి నేను సిద్ధం అని సుదీర్ఘ పోస్టులు చేశారు. 

A post shared by Nabeela Syed (@nabeelasyed)

భారత దేశ మూలాలున్న నబీలా సయ్యద్‌.. బర్కిలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పలు ఎన్జీవోలలో పని చేయడంతో పాటు మహిళా హక్కుల సాధన, అత్యాచార బాధితుల తరపున పోరాడుతున్నారామె.

ఇదీ చదవండి: లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణ

మరిన్ని వార్తలు