టెక్సాస్‌: మోనికా సింగ్‌.. అమెరికాలో న్యాయ పీఠంపై తొలి సిక్కు మహిళగా చరిత్ర

9 Jan, 2023 10:43 IST|Sakshi

ఆస్టిన్‌: భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్‌ మోనికా సింగ్‌ అరుదైన ఘనత సాధించారు. హ్యారిస్‌ కౌంటీ(టెక్సాస్‌) జడ్జిగా ఆమె ప్రమాణం చేశారు. తద్వారా అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 

70వ దశకంలో తొలినాళ్లలో మోనికా సింగ్‌ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో పుట్టి పెరిగిన ఆమె..  ప్రస్తుతం బెల్లయిరేలో నివాసం ఉంటున్నారు. ఆమె వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శుక్రవారం టెక్సాస్‌లోని హ్యారిస్‌ కౌంటీ సివిల్‌ కోర్టులో(లా నెంబర్‌ 4) ఆమె జడ్జిగా ప్రమాణం చేశారు. 

హ్యూస్టన్‌లోనే ట్రయల్‌ లాయర్‌గా 20 ఏళ్లపాటు పని చేసిన ఆమె.. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు, జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని సైతం వాదించారు. తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 


ఇద్దరు పిల్లలతో మోనికా సింగ్‌

సిక్కు వర్గానికి ఇవి మరిచిపోలేవని క్షణాలని ఇండో-అమెరికన్‌ న్యాయమూర్తి రవి సందిల్‌ పేర్కొన్నారు. మోనికా సింగ్‌ ప్రమాణ కార్యక్రమానికి హాజరైన ఆయన.. టెక్సాస్‌కు జడ్జిగా ఎన్నికైక తొలి సౌత్‌ ఏషియా వ్యక్తిగా ఘనత దక్కించుకున్నారు. అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది సిక్కు జనాభా ఉందని ఒక అంచనా.. అందులో 20వేల మంది హ్యూస్టన్‌లో ప్రాంతంలోనే స్థిరపడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 

మరిన్ని వార్తలు