సింగపూర్‌లో వాసవి జయంతి సంబరాలు

3 May, 2023 14:03 IST|Sakshi

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఇక్కడి సింగపూర్  ఆర్యవైశ్యులు చైనాటౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో శ్రీ వాసవి మాత జయంతిని  అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వాసవి జయంతితో పాటు VCMS దశమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఇదే సందర్భంగా నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆద్యంతమం ఆసక్తికరంగా జరిగాయి. కార్యక్రమాల్లో సుమారు 350 మందికి  పైగా ఆర్య వైశ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా తెలుగు సంప్రదాయ భోజనాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పలువురు ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో అలరించారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ  మరియమ్మన్ ఆలయం వైస్ చైర్మన్ బొబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.  VCMS కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి, సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్  వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా నాగరాజ్ కైల, శ్రీధర్  మంచికంటి మాట్లాడుతూ అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా  ప్రస్థానాన్ని  ప్రారంభించిన  VCMS పది సంవత్సరాలలో ఒక వటవృక్షంగా ఎదగటం శ్లాఘనీయమని, దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం, కృషి ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు రంగా రవికి చిరు సత్కారం జరిగింది.

'గణానాం త్వ గణపతిం' అంటూ  చిన్నారి కారె సాయి కౌశాల్ గుప్త చేసిన  రుగ్వేదం లోని గణపతి ప్రార్థనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారధ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించారు. సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ వాసవి మాత నాటక రూపానికి మూల ప్రతిపాదనను చైతన్య రాజా బాలసుబ్రహ్మణ్యం చేయగా, కథ, కూర్పు, సంభాషణలు ఫణేష్ ఆత్మూరి వెంకట రామ సమకుర్చారు. కిషోర్ కుమార్ శెట్టి దర్శకత్వం వహించారు. 

యువ కళాకారులు కుమారి అక్షర శెట్టి మాడిచెట్టి, చిరంజీవి ముక్తిధ మేడం, చిరంజీవి  ఉమా మోనిష నంబూరిల భరతనాట్య ప్రదర్శనలు, చిన్నారి తన్వి మాదారపు  ప్రదర్శించిన కూచిపూడి నృత్యం  ఆకట్టుకున్నాయి. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన, కొండేటి ఈశాన్ కృష్ణ  తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ అనంతర జరిగిన రథయాత్రలో భాగంగా శ్రీమతి గాదంశెట్టి నాగ సింధు గారి నేతృత్వంలో 16 మంది కళాకారిణులు చేసిన కోలాటం ప్రదర్శన కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. 

ఇదే సందర్భంగా VCMS నూతన కార్యవర్గ బృంద సభ్యులను  ప్రకటించారు. ప్రెసిడెంట్ గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల, కోశాధికారిగా ఆనంద్ గంధే, మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్‌లను ఆహూతులకు  పరిచయం చేశారు. అనంతరం సంస్థ అభివృద్ధికి  చేసిన ఇతోధిక  కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టికి ‘వాసవి సేవా కుసుమ’గా సత్కరించారు. సింగపూర్‌లో గత పది సంవత్సరాలుగా VCMS వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తూ సింగపూర్ లో పెరుగుతున్న ఆర్యవైశ్య భావితరానికి దీపస్తంభంగా వెలుగొందుతోందని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్, సహ వ్యాఖ్యాతగా వాసవి  ఫణేష్ ఆత్మూరి వ్యవహరించారు. కార్యనిర్వాహక బృందం, దాతలు, సేవాదళ సభ్యుల అంకితభావం వల్లనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని నూతన ప్రెసిడెంట్ మురళీకృష్ణ పబ్బతి పేర్కొంటూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు