Minsa Mariam Jacob: పుట్టినరోజునాడే విషాదం.. స్కూల్‌ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో..

15 Sep, 2022 19:45 IST|Sakshi

ఓ చిన్నారి పుట్టిన రోజునే మరణించిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. బాలిక మరణానికి కారణమైన స్కూల్‌ను మూసి వేయాలంటూ దేశ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. 

కుటుంబ సభ్యుల వివరాల మేరకు..కేరళకు చెందిన మిన్సా మరియమ్ జాకబ్ (4) ఖతార్‌లోని అల్ వక్రా ప్రాంతంలోని స్ప్రింగ్‌ఫీల్డ్ కిండర్ గార్టెన్ స్కూల్లో నర్సరీ చదువుతుంది. ఈక్రమంలో మిన్సా పుట్టిన రోజు కావడంతో... స్కూల్లో తోటి చిన్నారుల సమక్షంలోనే జరుపుకోవాలని అనుకుంది. ఎప్పటిలాగానే ఆ రోజుకూడా స్కూల్‌ బస్‌లో బయలు దేరింది.

అయితే, మార్గం మధ్యలో మిన్సా బస్సులో నిద్ర పోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు సిబ్బంది..చిన్నారి లోపల ఉన్నది గమనించలేదు. ఆమె దిగి వెళ్లిపోయిందని అనుకున్నారు. బస్సును పార్కింగ్‌ చేసి వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం డ్రైవర్‌ బస్సు డోర్లు ఓపెన్‌ చేసి చూడగా చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. దీంతో అత్యవసర చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, మిన్సా ప్రాణాల్ని కాపాడలేకపోయారు. తీవ్రమైన ఎండలకు ఊపిరాడక చిన్నారి బస్సులో మృతి చెందినట్లు పోలీసుల జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. పుట్టినరోజునాడే తమ బిడ్డకు నూరేళ్లు నిండాయంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ సంఘటన తర్వాత, అల్ వక్రాలోని స్ప్రింగ్‌ఫీల్డ్ కిండర్ గార్టెన్‌ను మూసివేయాలని ఖతార్ దేశ  మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక చిన్నారి మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు