NATA Convention : అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

3 Jul, 2023 10:16 IST|Sakshi

నాటా వేదికగా మహానేత డా.వైఎస్సార్‌ జయంతి వేడుకలు

డల్లాస్‌లో నాటా తెలుగు మహాసభల సందర్భంగా స్మరణ

ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ప్రవాసాంధ్రుల ఘన నివాళి

డల్లాస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

జూన్‌ 30 నుంచి జులై 2 వరకు డల్లాస్‌లో జరిగిన నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన రాజన్న అభిమానులు, నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు.


(నాటా పూర్వ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి)

ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ & ట్రైనింగ్ చల్లా మధుసూధన్ రెడ్డి, నాటా పాస్ట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, నాటా సభ్యులు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పండుగాయల, ఏపీ ఎన్‌ఆర్‌టీ మేడపాటి వెంకట్, అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్‌ రమేష్ రెడ్డి, వైస్సార్సీపీ నేతలు, వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.

విద్యార్థి దశ నుంచే ప్రజాసేవ వైపు అడుగులు

వైఎస్సార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్‌.మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌లోనూ హౌస్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


(నాటా వేదికగా జరిగిన వైఎస్సార్ జయంతికి హాజరైన ప్రముఖులు)

ఓటమి ఎరుగని నేత

1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు.

ఉత్తాన పతనాలు
వైఎస్సార్‌ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి  పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్‌ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లోనూ వైఎస్సార్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. 

వైఎస్సార్ సిపి @ నాటా వేడుకల కన్వెన్షన్

నాటా వేడుకల సందర్భంగా విచ్చేసిన అతిథులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. డాలస్ లోని కన్వెన్షన్ సెంటర్ వద్ద తోరణాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ పరిపాలన ముఖ్యాంశాలను ప్రదర్శించింది.

 
(అమెరికా డాలస్ లోని  నాటా వేదిక)

అమెరికాతో డా.YSRకు అనుబంధం 

మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారిక కార్యక్రమం కోసం అమెరికాలో అడుగుపెట్టారు. ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా డా.వైఎస్సార్‌ను ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. మే 8న మిస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం ఎలా వెన్నెముకగా నిలవాలన్న విషయాన్ని చర్చించారు. షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్‌ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా రాజసమైన పంచెకట్టులో ఎన్నారైలపై చెరగని ముద్ర వేశారు రాజశేఖరరెడ్డి. తన చిరకాల మిత్రుడు ప్రైమ్‌ హాస్పిటల్స్‌ అధినేత ప్రేమ్‌సాగర్‌ రెడ్డితో కలిసి వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. 

(చదవండి: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం: నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు