ఉత్తర టెక్సస్‌ ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య సదస్సు

1 Nov, 2020 21:45 IST|Sakshi

టెక్సస్‌ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 159 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు నేడు డాలస్ లో చాలా ఘనంగా జరిగింది. నెలనెలా తెలుగు వెన్నెల సమావేశం దసరా పండుగ సందర్భంగా సాహిత్య గోష్ఠి తోబాటు సభికులందరూ శుభాకాంక్షలు పంచుకొనే అవకాశం కలిగినట్లయింది. సాహిత్యాన్ని గురించిన చర్చలు, తెలుగు పండుగ రెండూ మన సంస్కృతిని గుర్తు చేసేవే కాబట్టి  సభ్యులందరూ విచ్చేసి ఉత్సాహం కనబరచారు.

 పద్మ దేవగుప్తపు “కవి-సత్యాన్వేషణ” అన్న అంశంపై ప్రధాన ప్రసంగం చేస్తూ ప్రాచీన కాలంనుండి మొదలు ఆధునిక యుగం వరకూ సాగుతున్న తెలుగు కవితా ప్రస్థానంలో ఆయా మహాకవులు తమ తమ సాహిత్యంలో ఏవిధంగా ఆయా కాలాలను ప్రభావితం జేసిన సామాజిక సత్యాలను పొందుపరచారో సోదాహరణంగా వివరించారు. ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన శ్రీనాథ కవి సార్వభౌముడు సంస్కృతాంధ్రము, అచ్చతెనుగు రెంటిలోనూ ఏ విధంగా సాహిత్య సవ్యసాచియో నిరూపణ చేశారు. శ్రీనాథుని అచ్చతెలుగు కవితా పటిమను సోదాహరణంగా అర్థతాత్పర్య సహిత విశేషాలతో వివరించడం జరిగింది. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, అక్టోబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు.

మరొక అంశంలో లెనిన్ బాబు వేముల దసరా పండుగ సందర్భంగా రాచాలపల్లి బాబు దేవీదాసు సంగ్రహపరచిన “శ్రీ లలితా సహస్రనామార్థ సంగ్రహం” లోని కొన్ని శ్లోకాలను అర్థ సహితంగా సభికులకు వివరించడం జరిగింది. లలితా సహస్రనామ పుట్టుక, సాహిత్యంలో దాని విశిష్ఠతను కూడా సభికులు గ్రహించే విధంగా చెప్పడం జరిగింది. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కృష్ణా రెడ్డి కోడూరు ముఖ్య అతిధి పద్మజ దేవగుప్తపు ,ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలకి, మిగిలిన వక్తలకి,విచ్చేసిన సాహిత్య అభిమానులకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు