ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలి

7 May, 2022 12:40 IST|Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 90 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 1 మే 2022 నాడు జరిగిన అంతర్జాల  కార్యక్రమములో పూజ్య బ్రహ్మశ్రీ పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భార్య భర్తని ఎలా పేరు పెట్టి పిలవదో, గురువుని కూడా పేరు పెట్టి పిలవరని, ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మనందరికీ గురువు అని చెపుతూ, వారు ఒక కర్మయోగి, మహాజ్ఞానీ, తపశ్వి అని, వారి జీవితం ఒక తపస్సు అని చెప్పారు... నేను ఒక స్వామిజి అయినా మీరు అందరు చేస్తున్న ప్రయత్నాలకు నేను నమస్కరిస్తున్నాను అని చెపుతూ ఎందుకంటె మీరందరు ఒక తపస్వికి, జ్ఞానికి, కర్మయోగికి భారతరత్న కోసం చేస్తున్న కృషిని కొనియాడారు... భారతరత్నకి ఘంటసాల గారు పూర్తిగా అర్హులు అని చెపుతూ గారి గొప్పతనాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు...
 

ఒక అమరగాయకుడుగా మరియు సంగీత దర్శకుడుగా 10,000 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరియు తులు బాషలలో పాటలుతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ పుష్ప విలాపం, కుంతీ విలాపం, దేశభక్తి గీతాలు పాడటం మరియు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత  ఇప్పటికి తెలుగువారి ఇళ్లలో మారుమోగుతోందని అని చెప్పారు. అలాగే స్వీయ సంగీత దర్శకుడుగా 110 కంటే ఎక్కువ సినిమాలుకు సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాలాంటి పాటలను, వాగ్గేయకారుడుగా పాటలను రచించి, సంగీత స్వర కల్పన కూర్చి మరియు వారి అమృత గాత్రంతో  ఆ పాటలకు జీవం పోశారు అని చెప్పారు, అలాగే 15వ శతాభ్దం అన్నమయ్య తరువాత తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడు అని తెలియచేస్తూ... వీటన్నటితోపాటు పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షని అనుభవించిన గొప్ప దేశభక్తుడని అని కొనియాడారు. ఘంటసాల గారికి భారతరత్న కోసం change.org లో నేను సంతకం చేస్తున్నాని చెపుతూ మీరందరు కూడా సంతకాల సేకరణను ఇంకా ఉదృతం చేయాలనీ కోరారు. 15 కోట్ల మంది తెలుగు వారి ఆకాంక్షని కేంద్ర పాలకులకు చేరేంతవరకు అందరు కలసి కృషి చేయాలనీ దిశా నిర్దేశము చేసారు...

యూఎస్‌ఏ నుంచి నాటా మాజీ అధ్యక్షుడు డా. రాఘవ రెడ్డి గోసాల, నాట్స్‌ అధ్యక్షుడు విజయ శేఖర్ అన్నే,  ధర్మయోగి ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాంకుమార్ యడవల్లి, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు రమేష్ బాబు చాపరాల, నారాయణరెడ్డి ఇందుర్తి, భారతదేశం నుండి సంకలనకర్త, ఘంటసాల గాన చరిత, చల్లా సుబ్బారాయుడు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు తదితరులు పాల్గొని మాట్లాడుతూ..,  పరిపూర్ణానంద స్వామి పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి ఒక కొత్త ఉత్సాహాం వచ్చిందన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని  తెలిపారు.

ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల  సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 93 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, 
 

మరిన్ని వార్తలు