ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ కావాలి.. పెండింగ్‌లో వేలకొద్ది పాకిస్తానీయుల దరఖాస్తులు

11 Feb, 2022 12:21 IST|Sakshi

భారత్‌ పాక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. క్రికెట్‌ మ్యా్‌చ్‌ మొదలు కశ్మీర్‌ వరకు విమర్శలు ప్రతివిమర్శలు ఇరు పక్షాల నుంచి అధికంగా జరుగుతుంటాయి. అయితే ఇందుకు విరుద్ధంగా భారత పౌరసత్వం కావాలంటూ కోరుతున్న విదేశీయుల్లో పాకిస్తానీయులే అధికంగా ఉన్నారు. 

ఫస్ట్‌ పాకిస్తాన్‌
సిజిజన్‌షిప్‌ యాక్ట్‌ 1955 ప్రకారం 2016 నుంచి విదేశీయులకు జారీ చేసిన పౌరసత్వ వివరాలను మంత్రి నిత్యనంద్‌రాయ్‌ పార్లమెంటులో వెల్లడించారు. దీని ప్రకారం 2016 నుంచి 2021 మధ్య మొత్తం 4,800ల మంది విదేశీయులకు ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ జారీ చేశారు. ఇందులో అధికంగా పాకిస్తానీయులు ఉన్నారు. మంత్రి చెప్పిన వివరాల ప్రకారం పాకిస్తానీయులు (2,405), ఆఫ్గన్స్‌ (431), బం‍గ్లాదేశీయులు (132), శ్రీలంకన్స్‌ (92), అమెరికన్స్‌ (80)లుగా టాప్‌ 5లో ఉన్నారు. 

పెండింగ్‌లో అదే ట్రెండ్‌
భారత పౌరసత్వం కావాలంటూ కేంద్రం వద్ద ప్రస్తుతం 10,635 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అధికంగా 7,306 మంది పాకిస్తానీయులే కావడం గమనార్హం. పాక్‌ తర్వాత 1,152 మందితో అఫ్గన్స్‌ ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇతిమిద్దంగా ఏ దేశం పేరు చెప్పకుండా ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ అడుగుతున్న పౌరుల సంఖ్య 428 మంది వరకు ఉంది.

2021లో అధికం
ఇటీవల కాలంలో విదేశీయులకు పెద్ద సంఖ్యలో భారత పౌరసత్వం లభిస్తుంది. ఇయర్ల వారీగా చూస్తే 2021లో 1,773 ఉండగా ఆ తర్వాత వరుసగా 2020లో 639, 2019 ఏడాదిలో 987, 2018 ఏడాదిలో 628, 2017 ఏడాదిలో 817 మందికి  భారత పౌరసత్వం జారీ అయ్యింది. 

అమెరికాకే ప్రాధాన్యం
ఇక గడిచిన ఐదేళ్ల కాలంలో ఫారిన్‌ సిటిజన్‌షిప్‌ కోసం దాదాపు 8 లక్షల మంది తమ భారతీయ పౌరసత్వం వదులుకున్నారు. ఇందులో దాదాపు 42 శాతం మంది అమెరికా సిటిజన్‌షిప్‌ పొందగా... ఆ తర్వాత స్థానాల్లో కెనడా (91 వేల మంది), ఆస్ట్రేలియా (86,933), యూకే (66,193), ఇటలీ (23,490)లు ఉన్నాయి. ఇక 83,191 మంది ప్రపంచంలో ఉన్న 86 దేశాల్లో వేర్వేరుగా పౌరసత్వం తీసుకున్నారు. 

చదవండి: పాత పాస్‌పోర్ట్‌లకు కాలం చెల్లు

మరిన్ని వార్తలు