Pravasi Bharatiya Divas-2022: దేశమేదైనా అండగా మేమున్నాం

9 Jan, 2022 12:06 IST|Sakshi

ఇంజనీరింగ్ చదివి అప్పుచేసి ఆశల రెక్కలు తొడుక్కుని ఖతర్ లో అడుగు పెట్టాడు శివ. వైట్ కాలర్ జాబ్ చేసి.. నాలుగు రాళ్లు వెనకేసి కుటుంబాన్నీ నిలబెట్టడమే అతని లక్ష్యం. కానీ విమానం దిగగానే అతని కలలు చెదిరిపోయాయి. ఏజెన్సీ నిర్వాహకులు చేసిన మోసంతో దేశం కానీ దేశంలో నిలువనీడ లేకుండా కట్టు బట్టలతో నిలబడ్డాడు. కడుపు నింపుకోవడానికి మరో మార్గం లేక అక్కడే భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. అయితే అతని కథ విన్న ఓ ప్రవాస భారతీయ సంక్షేమ సంస్థ అతనికి అండగా నిలబడింది. విదేశాల్లో ఉండే రూల్స్ గురించి వివరించి, తమకున్న పరిచయాలతో అక్కడే ఓ సంస్థలో ఇంజనీర్ గా ఉద్యోగం ఇప్పించింది. దీంతో శివ అతని కుటుంబం నిలదొక్కునే అవకాశం వచ్చింది. కానీ ఇలాంటి సాయం దొరక్క అభాగ్యులుగా మిగిలిపోయేవారు ఎందరో... అందుకే  విదేశాల్లోని తమ వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వ ఏర్పాట్లకు అదనంగా సేవలు అందిస్తున్నాయి ప్రవాసి సంస్థలు. మేమున్నాం అంటూ విదేశాల్లో మన వాళ్ళకి అండగా నిలుస్తున్నాయి. అంతేకాదు స్థానికంగా సమస్యల పరిష్కారానికి ఉడతా భక్తి సాయం అందిస్తూ పుస్తకాల పంపిణీ, మంచి నీటి సౌకర్యం, టెక్నాలజీ సాయం చేస్తున్నాయి.

ప్రవాసీల పండుగ
ప్రవాస భారతీయులు, భారతీయ సంతతి ప్రజలతో మాతృదేశంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, రాజకీయంగా, ఆర్థికంగా, దాతృత్వపరంగా భారతదేశ అభివృద్ధికి ప్రవాసులు చేసిన కృషికి గుర్తుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తున్నారు

నేపథ్యం
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి 1915 జనవరి 9 తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని 2003 నుండి ప్రతిఏటా ప్రవాసి భారతీయ దివస్‌ను జరుపుకుంటున్నారు. 

సంఖ్య చిన్నదే..ప్రభావం పెద్దదే..!
విదేశాల్లో ఉన్న భారత ప్రవాసీలు 3 కోట్ల మంది. అనగా... భారతీయ జనాభాలో విదేశాలలో నివసించేవారు 3 శాతం లోపే... సంఖ్య చిన్నదే అయినా వీరి ప్రభావం పెద్దది. అవకాశాల భూమి అమెరికా... దశాబ్దాలుగా విభిన్న రంగాలలో భారతీయ నిపుణులను ఆకర్షిస్తోంది. అధిక జీతాలు, ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు ఉన్నత స్థానానికి అధిరోహించే అవకాశం.

అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్ళడానికి ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరో వైపు ఎప్పటి నుంచో భారతీయ కార్మిక వర్గం, ప్రొఫెషనల్స్ ని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నాయి గల్ఫ్ దేశాలు. బ్రిటిష్ వలస పాలన సమయంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ దీవులు, తూర్పు ఆసియా దేశాలైన మలేసియా, సింగపూర్ లలో కూడా ప్రవాస భారతీయులు గణనీయంగా ఉన్నారు. బ్రిటన్, కెనడా దేశాల్లో పంజాబీ ల హవా ఉండగా.. గల్ఫ్ దేశాల్లో కేరలీయులు చొచ్చుకుపోయారు. అయితే ఈ దేశాల్లో అమెరికా, గల్ఫ్ దేశాల్లో తెలుగు సంఘాలు సాటి భారతీయుల కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి.

అమెరికాలో నాట్స్, ఆటా, తానా, ఏటీఎస్‌, వంటి సంస్థలు కతర్ లో ఇండియన్ కమ్యూనిటీ బెనువలెంట్ ఫోరమ్ (ఐసీబీఎఫ్‌), తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్, చాలా దేశాల్లో తెలంగాణ జాగృతి, గల్ఫ్ ప్రాంతంలో గల్ఫ్ జెఏసీ, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, ఇండియాలో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం, వివిధ రాజకీయ పార్టీల ప్రవాసీ విభాగాలు ఇలా వందలకొద్ది సంస్థలు సేవలు అందిస్తున్నాయి.

తిరిగి ఇవ్వాలనే - మిథిలారెడ్డి (ఖతార్‌)

ఇండియా మాకు అన్నీ ఇచ్చింది. చదువు, ఉద్యోగం, హోదా.. వాటితోనే మేము గల్ఫ్ దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. తిరిగి మాతృ  దేశానికి ఏదైనా చేయాలనే తలంపుతోనే వ్యక్తిగతంగా, వేకువ ఫౌండేషన్ ద్వారా చేతనైనంత సాయం చేస్తున్నాం. మా సంఘం  సభ్యులు తెలంగాణ లోని తమ స్వంత ఊర్లకు, మేము మా స్వంత జిల్లా మహబూబ్‌నగర్‌ లో రెగ్యులర్‌గా సర్వీస్‌ యాక్టివిటీస్‌ చేస్తుంటాం. 

టెక్నాలజీ అందించాలని - ప్రీతిరెడ్డి, టిడిఎఫ్-అమెరికా
వ్యవసాయం రంగంలో అమెరికా అధునాత పద్దతులను పాటిస్తున్నది. తెలంగాణ లోని రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పక్షాన 'జై కిసాన్' కార్యక్రం చేపట్టాము. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, తేనెటీగల పెంపకం లాంటి పద్దతులపై ఎంపిక చేసిన గ్రామాలలో రైతులకు శిక్షణ అందిస్తున్నాము.

చదవండి: మొదటి 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' కార్డు గ్రహీత మన హైదరాబాదీ! 

మరిన్ని వార్తలు