విదేశాల్లో తెలుగు వెలుగులు, చిన్నారుల నోట భాగవత ఆణిముత్యాలు

18 Jul, 2021 12:48 IST|Sakshi

భాగవతం ఆణిముత్యాలు. ఆర్గ్ వారి  "రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ - 2021" సింగపూర్ కార్యక్రమం ఆన్‌ లైన్‌ వేదికగా జరిగింది.  చిన్నదేశమైన  సింగపూర్  నుంచే 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతన భాగవతంలోని పద్యాలను నేర్చుకొని పాడి వినిపించడంతో పాటు చక‍్కగా వర్ణించడం పండితుల్ని విశేషంగా ఆకట్టుకుంది.  

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ భాగవత పద్యపఠన పోటీలలో భాగంగా సింగపూర్ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఈ వారాంతంలో తొలిదశ పోటీ కార్యక్రమాన్ని సింగపూర్ లోని ప్రధాన సంస్థలైన "కాకతీయ సాంస్కృతిక పరివారం"  "తెలుగు భాగవత ప్రచార సమితి" "శ్రీ సాంస్కృతిక కళాసారథి" మరియు "సింగపూర్ తెలుగు సమాజం" కలిసి అంతర్జాల వేదికపై చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా అమెరికా నుండి "భాగవత ఆణిముత్యాలు" సంస్థ అధ్యక్షులు శ్రీ మల్లిక్ పుచ్చా, మరియు నిర్వాహకులు సాయి రాచకొండ, ప్రముఖ గాయకులు నేమాని పార్థసారథి విచ్చేసి చిన్నారులకు ఆశీస్సులు అందించారు. 

ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలైన లంక దుర్గాప్రసాద్ , పాతూరి రాంబాబు,దొర్నాల రాధాకృష్ణ శర్మలు చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు శ్రీ ఊలపల్లి భాస్కర్ మాట్లాడుతూ  భాగవతం వంటి ఆధ్యాత్మిక నిధిని మన భావి తరాలకు అందజేయడం ఎంతో అవసరమని, అందుకు IBAM వంటి సంస్థలు ఇటువంటి పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలలో ముఖ్యంగా భాగవతంపై ఆసక్తి పెరిగేందుకు తోడ్పడుతుందని, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో సింగపూర్ నుండి తమ చిన్నారులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని" హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేక బహుమతిగా

శ్రీ నేమాని పార్థసారథి గారిచే  నెల రోజుల పాటు భాగవత పద్యాల  శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే కార్యక్రమంనుండి ఎంపిక చేయబడిన చిన్నారులు సెప్టెంబరులో జరుగనున్న రెండవ దశ పోటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు  జ్యోతీశ్వర రెడ్డి, కాకతీయ సాంస్కృతిక పరివారం ఉపాధ్యక్షుడు  సుబ్బు పాలకుర్తి ,  సాంస్కృతిక  కళాసారథి అధ్యక్షులు  కవుటూరు రత్న కుమార్ తదితరులు పాల్గొని చిన్నారులకు చక్కటి ప్రోత్సాహాన్ని, అభినందనలని అందజేశారు. 

ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్న పిల్లలకి రాధ పింగళి గత ఆరు వారాలుగా తర్ఫీదునిచ్చి పోటీకి వన్నె తెచ్చారు. రామాంజనేయులు చామిరాజ్ వ్యాఖ్యాతగా, సమన్వయకర్తగా చేసారు. గణేశ్న రాధా కృష్ణ సాంకేతిక సమన్వయం అందించగా చివుకుల సురేష్ , జాహ్నవి వేమూరి, రాధికా మంగిపూడి  తదితరులు సాంకేతిక సహకారం అందించారు. 

మరిన్ని వార్తలు