ఉక్రెయిన్‌ ఉద్రిక్తలు.. చిక్కుకుపోయిన 20 వేల మంది ఇండియన్లు.. ఎయిర్‌ లిఫ్ట్‌ షురూ

22 Feb, 2022 10:44 IST|Sakshi

ఉక్రెయిన్‌ వివాదం యుద్ధం చివరి అంచులకు చేరుకోవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న మన వారిని స్వదేశానికి వచ్చేయాలంటూ సూచనలు జారీ చేశారు. అయితే పరిస్థితి మరింతగా విషమించడంతో భారతీయులను తీసుకొచ్చేందుకు ఉక్రెయిన్‌కి స్పెషల్‌ ఫ్లైట్‌ పంపి ఎయిర్‌ లిఫ్ట్‌ చేయాలని నిర్ణయించారు. 

మంగళవారం రాత్రి ఉక్రెయిన్‌ నుంచి ఇండియాకు తొలి బోయింగ్‌ విమానం రానుంది. ఈ మేరకు ఉదయం 7:40 గంటలకు ఓ ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కి బయల్దేరి వెళ్లింది. ఇందులో సుమారు రెండు వందల మంది వరకు ఇండియన్లను తరలించనున్నారు. మరో రెండు విమానాలను సైతం ఎయిర్‌ లిఫ్ట్‌ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది వరకు భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ చెబుతోంది.

ఉక్రెయిన్‌లో రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటనతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. తాము గుర్తించిన స్వతంత్ర దేశాల రక్షణ కోసం శాంతి దళలాలను పంపుతామని పుతిన్‌ స్పష్టం చేశారు. మరోవైపు రష్యాపై నాటో, ఈయూతో పాటు బ్రిటన్‌ కూడా కఠిన ఆంక్షలు విధించాయి. ఇక ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఐక్యరాజ్య సమితి ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు