ఖతార్‌లో సాక్షి దినపత్రిక 'గల్ఫ్ జిందగీ' సావనీర్ 

13 Sep, 2022 13:48 IST|Sakshi
మార్కో పోలో కు సాక్షి 'గల్ఫ్ జిందగీ' కథనాలను వివరిస్తున్న స్వదేశ్ పరికిపండ్ల

ఖతార్‌: ఖతార్ లోని సిటీ సెంటర్ రొటానా హోటల్‌లో బసచేసిన తెలంగాణ వలస కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్లను బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఇ) సంస్థకు ఖతార్‌లో  కమ్యూనిటీ లైజన్ ఆఫీసర్ (ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్) గా పనిచేస్తున్న మార్కోపోలో ఫెర్రర్ మర్యాదపూర్వకంగా సోమవారం  కలుసుకున్నారు.  సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు వలసలపై ఆసియా-గల్ఫ్ దేశాల చర్చల సమావేశానికి హాజరవడానికి స్వదేశ్ పరికిపండ్ల ఒకరోజు ముందు ఖతార్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

స్వదేశ్ పరికిపండ్ల వద్ద ఉన్న సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్‌ను చూసి సంతోసం వ్యక‍్తం చేశారు మార్కో పోలో.  తెలుగు రాకపోయినా 88 పేజీల పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని  ఫోటోల ద్వారా  గల్ఫ్ వలసల గురించి సమాచారం ఉన్న పుస్తకం అని గమనించారు. దీంతో  వివరాలను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి అతనికి స్వదేశ్  వివరించాడు. దాదాపు గంటన్నర సేపు ముఖ్య కథనాల సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా వినడమేకాదు, ఈ సావనీర్‌ను ఇంగ్లీష్‌లోకి అనువదించి ఒక పుస్తక రూపంలో వేయాలని మార్కో పోలో సూచించడం విశేషం. 

'గల్ఫ్ జిందగీ' సావనీర్ గురించి...  
గల్ఫ్ వలసలు - అభివృద్ధి, కష్టాలు, సుఖాలు, హక్కులు, జీవితాలపై, సమాజంపై, ప్రభుత్వాలపై చూపించే ప్రభావం, ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం సాక్షి జిల్లా పేజీల్లో  'గల్ఫ్ జిందగీ' ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన 'గల్ఫ్ జిందగీ' పేజీ 22 నెలలుగా సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా ప్రచురితమైన అన్ని పేజీలను కూర్పు చేసి ఒక సావనీర్ గా రూపొందించారు.

వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు 'గల్ఫ్ జిందగీ' వారధిలా ఉపయోగపడుతూ సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఒక భరోసానిస్తూ ముందుకెళ్లింది. మొదట్లో ప్రతీ శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరికమేరకు 15 జూన్ 2018 నుండి గల్ఫ్ దేశాలలో సెలవుదినం అయిన శుక్రవారానికి మార్చారు.

ఈ పేజీలో గల్ఫ్‌ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి కుటుంబాల జీవనంపై కథనాలు ఇచ్చారు. ఇవే కాకుండా గల్ఫ్‌లో కష్టాలను జయించి మెరుగైన జీవితం గడుపుతున్న కార్మికుల సక్సెస్‌పై కూడా ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించారు. 

'గల్ఫ్ జిందగీ' పేజీకి కావలసిన సమాచార సేకరణలో సహకరించిన 'మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా' సభ్య సంస్థ  'ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం' అధ్యక్షులు మంద భీంరెడ్డి గారికి కృతఙ్ఞతలు అని ఎడిటర్ సావనీర్ ముందు మాటలో రాశారు. అద్భుతమైన కథనాలు అందించిన సాక్షి గల్ఫ్ డెస్క్, విలేఖరుల బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి.  తెలంగాణ గల్ఫ్ వలసల చరిత్రలో ఈ  'గల్ఫ్‌ జిందగీ' సావనీర్ ఆవిష్కరణ గుర్తుండిపోయే ఘట్టంగి నిలిచిపోయింది.

సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

(https://www.sakshi.com/sites/default/files/article_images/2019/10/4/gulf_book.pdf

మరిన్ని వార్తలు