WhatsApp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక..! ఈ ఎమోజీ పంపితే 20 లక్షల జరిమానా..!

17 Feb, 2022 12:09 IST|Sakshi

Warning for Whatsapp Users: వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.  ఇకనుంచి వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అక్కడి ప్రభుత్వం యూజర్లను హెచ్చరించింది. ఒక వేళ రెడ్ హార్ట్ ఏమోజీలను పంపితే  రూ.20 లక్షల జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. .

వేధింపులతో సమానంగా...
గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం... వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు. వాట్సాప్‌లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపించడం వేధింపుల నేరమవుతుందని ఆయన పేర్కొన్నారు.  యూజర్లు ఇతరులకు రెడ్ హార్ట్ ఎమోజి మెసేజ్లను పంపితే వారు తీవ్రంగా భావిస్తే  కేసు నమోదు చేస్తే చిక్కుల్లో పడక తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయడం నేరం. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్‌లో సంభాషణలు జరపవద్దన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

సౌదీ అరేబియాలో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని వేధింపుల కింద పరిగణిస్తారు. అక్కడి ఆచార సాంప్రదాయాల ప్రకారం వాట్సాప్‌లో రెడ్ హార్ట్ లేదా రెడ్ రోజెస్ వంటి ఎమోజీలను పంపించడం తమ గౌరవానికి భంగంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే దోషికి 1లక్ష సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు దోషిగా తేలితే 3లక్షల సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధించడంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు