సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంత్యుత్సవం

30 May, 2023 14:50 IST|Sakshi

కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శనివారం అన్నమయ్య 615వ జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. గోవిందనామ సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగింది.  

ఈ సందర్భగా నిర్వహించిన సాంస్కృతిక  కార్యక్రమాలు అలరించాయి. గాయకులు గరిమెళ్ళ అనీల్‌ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం  ఆశ్చర్యానందాలను కలిగించింది. అనంతరం సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు చిత్రాకారుడు కూచిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సారాలుగా అన్నమయ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు 
గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
 
సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి కుమార్తె పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో  ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగ సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి  వాయులీన గానంతో అలరించారు. వారికి  అనూరాధ శ్రీధర్ వయలిన్, శ్రీరామ్ బ్రహ్మానందం మృదంగ సహకారాన్ని అందించారు.  సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించారు.

 

చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గారి గాత్రంతో స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు అందజేశారు.  కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర,  కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మలకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు