కనికరించలేదు.. సింగపూర్‌లో ‘మానసిక వికలాంగుడు’ నాగేంద్రన్‌ను ఉరి తీశారు

27 Apr, 2022 09:53 IST|Sakshi

సింగపూర్ సిటీ: పదేళ్లుగా మరణ శిక్ష నుంచి తప్పించాలంటూ చేసుకున్న అభ్యర్థనలు, పిటిషన్‌లు వ్యర్థం అయ్యాయి. డగ్ర్స్‌ కేసులో పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్‌ ధర్మలింగంను ఎట్టకేలకు సింగపూర్‌లో ఉరి తీశారు. ఇవాళ(బుధవారం) ఉదయం ఉరిశిక్షను అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ధర్మలింగంను.. మానసిక వికలాంగుడనే కారణంతో విడిచిపెట్టాలంటూ విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. 

చివరి కోరిక తీర్చి.. 
నాగేంద్రన్‌న్‌ ఉరిని అతని కుటుంబ సభ్యులు సైతం ధృవీకరించారు. ఉరికి ముందు నాగేంద్రన్ చివరి కోరికను అధికారులు తీర్చినట్లు తెలుస్తోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులను ఒకసారి కలుసుకోవాలని ఉందని చెప్పడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన తర్వాత  అతడికి మరణశిక్షను అమలు చేశారు. 

కేసు వివరాలు.. 
మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్‌​లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్‌ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో గతేడాది  నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేసేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే..

విమర్శలు..నిరసనలు
మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌) నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సింగపూర్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.  యూరోపియన్ యూనియన్ సహా బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అతడి తల్లి తరపున న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాగేంద్రన్ పిటిషన్‌ను గత బుధవారం కొట్టేసింది. 

ఇది కోర్టు ప్రక్రియలను దుర్వినియోగం చేయడానికి, నాగేంద్రన్‌కు విధించిన చట్టబద్ధమైన శిక్ష అమలులో అన్యాయంగా ఆలస్యం చేయడానికి తాజా ప్రయత్నం అంటూ సింగపూర్‌ అటార్నీ జనరల్‌ చాంబర్స్‌ అభిప్రాయపడింది. దీంతో న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాష్, బెలిండా ఆంగ్ చివరి నిమిషంలో అతడి దరఖాస్తును తోసిపుచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ‘‘కోర్టు చివరి మాట అంటే చివరి మాటే..’’ అని అన్నారు. అలాగే బుధవారం(ఏప్రిల్ 27) ఉదయం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. మలేషియాలోని ఇపో పట్టణంలో నాగేంద్రన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతని సోదరుడు నవీన్ కుమార్ మీడియాతో చెప్పాడు.

చదవండి: హద్దు మీరితే.. ఏడాదికి 560 విపత్తులు, 2030 దాకా!

మరిన్ని వార్తలు