పండిత పామర రంజకంగా సింగపూర్ లో కార్తీక పౌర్ణమి వేడుకలు.

19 Nov, 2021 21:08 IST|Sakshi

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ వారు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా, శివభక్తి మయమైన చక్కటి సాంప్రదాయక కథాగాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాల వేదికపై అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో హరికథకు పుట్టినిల్లయిన విజయనగరం నుంచి 'హరికథా చూడామణి' కాళ్ళ నిర్మల భాగవతారిణి ఆలపించిన హరికథా గానంతో కార్యక్రమం ప్రారంభించారు. వల్లీ కళ్యాణం ఇతివృత్తంగా రుద్రాక్ష మహిమను తెలుపుతూ చక్కటి కథాగానంతో, పద్యాలతో మాధుర్యభరితమైన గాత్రంతో ఆహార్యంతో ఆమె అందరిని ఆకట్టుకున్నారు. 

వయోలిన్ పై యమ్ జి భానుహర్ష మృదంగంపై యమ్ మహేశ్వరరావు ఆమెకు వాద్య సహకారం అందించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి "శ్రీ విఘ్నేశ్వర కళా బృందం" బుర్రకథ కళాకారులు 'పార్వతీ కళ్యాణ' ఘట్టాన్ని చక్కటి బుర్రకథగా మలచి, అందరిని అలరించే జానపద శైలిలో అచ్చ తెలుగు మాటలలో లయబద్ధంగా వినిపించారు. ప్రధాన కథకులుగా యడవల్లి కృష్ణ ప్రసాద్ పాల్గొనగా, వచనంతో చిరంజీవి, హాస్యంతో కన్నబాబు సహకారాన్ని అందించి చక్కటి ఊపును అందించారు.

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ "కరోనా కష్టకాలంలో ఆదరణ కరువైపోతున్న హరికథ, బుర్రకథ  వంటి సంప్రదాయక కళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా భక్తి మార్గంతో మేళవించి ఏర్పాటు చేశామని, దీనికి "గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్" సంస్థవారు, మరియు సింగపూర్ నుండి స్థానిక సభ్యులు ముందుకు వచ్చి, కథాగానం వినిపించిన కళాకారులకు పారితోషికాలు అందించడం చాలా ఆనందంగా ఉంది" అని దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో సింగపూర్ నుండి స్థానిక గాయనీగాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, విద్యాధరి కాపవరపు, రాధికా నడదూరు, షర్మిళ చిత్రాడ, యడవల్లి శేషుకుమారి, శ్రీవిద్య, శ్రీరామ్, పాల్గొని చక్కటి శాస్త్రీయ శివభక్తి గీతాలను ఆలపించి భక్తి పారవశ్యాన్ని కలుగజేశారు. రామాంజనేయులు చామిరాజు వ్యాఖ్యాన నిర్వహణలో భాస్కర్ ఊలపల్లి, రాధిక మంగిపూడి సహ నిర్వాహకులుగా, రాధా కృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వాహకులుగా నడిపించిన ఈ కార్యక్రమాన్ని సుమారు 1000 మందికి పైగా ప్రపంచ నలుమూలల  నుంచి యూట్యూబ్ & ఫేస్బుక్ ద్వారా వీక్షించారు. 


 

మరిన్ని వార్తలు