ఘనంగా దీపావళి వేడుకలు

23 Nov, 2020 14:10 IST|Sakshi

ప్రపంచంలోనే భారతదేశం వెలుపల తెలుగు వారి కోసమే స్థాపించబడిన అతి కొద్ది ప్రాచీన సంస్థలలో ఒక్కటైన సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటికప్పుడు తన జవసత్వాలను కూడగట్టుకొంటూ, దిన దిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ 46వ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గాన గంధర్వుడు ‌పద్మ భూషణ్ బాల సుబ్రహ్మణ్యానికి, నాట్యమయూరి పద్మశ్రీ  శోభా నాయుడికి ఘన నివాళి అర్పిస్తూ.. అంతర్జాల వేదికపై సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవం, దీపావళి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: సింగపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు

ఆధ్యాంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. అంతేకాకుండా 45 వసంతాల సమాజ ప్రస్థానాన్ని, మధురానుభూతులను , గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను బుర్రకధ రూపకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో 3000 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి సందేశం, పూర్వపు కార్యనిర్వాహక సభ్యుల ఉపన్యాసాలు, చెప్పుకోండి చూద్దాం, పాటలు, రాజు కామెడీ, బుర్రకథలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకి, గాయని సత్యకి, మిమిక్రీ రాజుకి, యాంకర్ నవతకి, బుర్రకథ విజయకుమార్ బృందానికి , ఆర్కెస్ట్రా వెంకటేష్  బృందానికి, తమ బిజీ షెడ్యూల్‌లో కొంత విలువైన సమయాన్ని వెచ్చించి, అమూల్యమైన సందేశం అందించిన ఇండియన్ హై కమీషనర్ ఇన్ సింగపూర్  పి. కుమరన్‌, సింగపూర్ తెలుగు సమాజం వారు ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్స్ విషయంలో వారు చేసిన సహాయ సహకారాలకు సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సమాజ కీర్తిని, ప్రజలకు మెరుగైన సేవల్ని అత్యున్నత స్థాయిలో ఇవ్వటానికి తమ కమిటీ నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. సింగపూర్‌లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని , ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని కోరారు. 

తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌టీఎస్‌ పూర్వ కార్యదర్శులు, కోశాధికారులు 45 ఏళ్లుగా సమాజంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ సందేశాలు పంపినందుకు, కార్యక్రమానికి మా వెన్నంటి ఉన్న స్పాన్సర్లు శుభోదయం గ్రూప్‌కు, లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు,హమారా బజార్‌కు, సెక్రటరీ సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. రమ్య బెహెరా పాడిన అమ్మవారి పాటను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన శుభోదయం మీడియాకు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి కృతఙ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు