ఘనంగా శ్రీ రామాయణ జయమంత్రం కార్యక్రమం

30 Apr, 2021 22:54 IST|Sakshi

శ్రీరామనవమి సందర్బంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీరామాయణ జయ మంత్రం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో 22 దేశాలనుంచి అనేక మంది హాజరయ్యారు. సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్, మలేషియా తెలుగు సంఘం మలేషియా, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో జయ మంత్రదీక్ష కార్యక్రమం జరిగింది. ఇండోనేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులయిన రామాయణ హరినాథ రెడ్డి ఈ జయమంత్ర దీక్షను వీక్షకులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి అన్వేషణలో ఉపాసించిన జయ మంత్రం అత్యంత శక్తివంతమైనదన్నారు. వ్యక్తులు తాము అనుకున్న పనులు నెరవేరాలంటే ఈ దీక్షను 48 రోజులపాటు పాటించాలన్నారు. జయ మంత్ర ఉపాసన మనిషికి ధైర్యాన్నిస్తుందన్నారు. ఈ మంత్రం అజాత శత్రువులను చేస్తుందన్నారు. ఆశావాద దృక్పథాన్ని పెంచుతుందని, ఆయుష్షును వృద్ధి చేస్తుందన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతికి మూలం రామాయణమన్నారు. ప్రతి ఒక్కరు జయ మంత్ర దీక్ష తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపడానికి ముందుకొచ్చిన హరినాథ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులయిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ.. జయ మంత్రం మన అందరినీ విజయ బాటలో నడిపిస్తుందన్నారు.  ఈ కార్యక్రమాన్ని సుమారు 1,000 మందికి పైగా సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిపైన్స్, న్యూజిలాండ్ మొదలగు దేశాల వారు జూమ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారని తెలియజేశారు.

మలేషియా తెలుగు సంఘం ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ.. హనుమంతుడు ఆచరించిన జయమంత్రాన్ని ప్రజలకు తెలియజేసి, రామాయణ హరినాథరెడ్డి సమాజానికి మహోపకారం చేశారన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ.. శ్రీరామనవమి రోజు రెండు మహాకార్యాలను  నిర్వహించుకున్నామన్నారు. మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని అంజనాద్రి పర్వతంపై హనుమంతుడు జన్మించారనే విషయాన్ని నిరూపించడం. రెండవది ఈ జయమంత్ర దీక్షను తీసుకోవటమన్నారు. అనంతరం రామాయణంలోని సందేహాలను డా. సునీత, ఉషారాణి, డా. అరుణ కుమారి తదితరులు అడుగగా హరినాథ్‌రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గసభ్యులకు, మలేషియా తెలుగు సంఘం వారికి, టీటీడీ, శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల వారికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు