అట్లాంటాలో అంగరంగ వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం

16 Jul, 2022 12:17 IST|Sakshi

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటా నగరంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ (నాటా), APNRT అద్వర్యంలో HTA వారి సహకారంతో జులై 9వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి  కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది.

టీటీడీ కళ్యాణం కార్యనిర్వాహకవర్గం సభ్యులు  శ్రీనివాసులు రెడ్డి కొట్లూరి, నంద గోపి నాథ రెడ్డి, HTA కార్యవర్గ కమిటీ,  వారి మిత్ర బృందం, వాలంటీర్ల సహకారంతో స్వామి వారి కళ్యాణోత్సవం సజావుగా సాగేలా సమన్వయం చేసారు. 

తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు, వేదపండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్య ధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. హిందూ టెంపుల్ అఫ్ అట్లాంటా కార్య వర్గం  వారు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి, తరించారు, భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు. 

అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ వేడుకల్ని నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా తమ స్వస్థలాలకు రాలేక, స్వామివారి  దర్శనానికి నోచుకోని వేలాది మంది భక్తుల కోసం టీటీడీ  ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే.

దాదాపుగా 100 సభ్యులతో కూడిన గాన బృందం  ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలతో ఈ  వివాహ మహోత్సవం  ఘనంగా జరిగింది. గాయనీ గాయకులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీదర్ కొరసపాటి,  నాటా నేషనల్ కన్వెన్షన్  అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డితో పాటు, ఎస్‌వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ ఏఈఓ బి. వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ యూఎస్‌ఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నంద గోపినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు