ఇక్కడ పెళ్లి.. అక్కడికి వెళ్లాక లొల్లి

18 Nov, 2021 10:02 IST|Sakshi

ముఖం చాటేస్తున్న ఎన్‌ఆర్‌ఐ భర్తలు 

పరిష్కారానికి మహిళా భద్రతా విభాగం ప్రత్యేక దృష్టి 

మహిళా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ప్రత్యేక శిక్షణ  

సాక్షి, హైదరాబాద్‌: చట్టాలను ఎంత కఠినతరం చేసినా... ఎన్‌ఆర్‌ఐ వివాహాలు కొందరు అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వధువుకు ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటవుతోంది. పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లగానే వరుడు ముఖం చాటేయడంతో అమ్మాయి జీవితం ప్రశ్నార్ధకం అవుతోంది. భర్త విదేశాల్లో, భార్య ఇండియాలో పుట్టింట్లో ఉండటంతో కేసులు ఎటూ తేలడంలేదు. ఇటు తల్లిదండ్రులు, అటు అమ్మాయిలు ఏళ్ల కొద్ది వేచి చూడాల్సొస్తుంది. ఇలాంటి ఎన్‌ఆర్‌ఐ వివాహ కేసులను త్వరిగతిన కొలిక్కి తెచ్చేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కృషి చేస్తోంది. అందులో భాగంగా పోలీసులకు ఇటీవల ప్రత్యేకశిక్షణ ఇచ్చిన మహిళా భద్రతా విభాగం కేసుల పరిష్కారంపై పలు విషయాలను వెల్లడించింది.  

రెండేళ్లలో 222 ఫిర్యాదులు... 
రాష్ట్ర మహిళా భద్రతా విభాగంలో ఎన్‌ఆర్‌ఐ వివాహాల కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను జూలై 2019లో పోలీస్‌ శాఖ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 222 ఫిర్యాదులపై కేసులు నమోదుచేసినట్టు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. అయితే వీటిలో 38 కేసుల్లో భార్యాభర్తలు కాంప్రమైజ్‌ కాగా, 174 కేసులు పెండింగ్‌ దశలో ఉన్నాయన్నారు. 35 కేసులు దర్యాçప్తు దశలో ఉండగా, మిగిలిన 139 కేసులు పెండింగ్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని స్వాతిలక్రా తెలిపారు. 8 కేసుల్లో సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు చెప్పారు. మరో 23 మందిపై లుక్‌ ఔట్‌ నోటీసులు జారీచేసి ఎన్‌ఆర్‌ఐ భర్తను కోర్టుకు హాజరయ్యేలా చేశామని తెలిపారు.  

పోలీసులకు ప్రత్యేక శిక్షణ... 
ఎన్‌ఆర్‌ఐ కేసుల్లో త్వరితగతిన న్యాయం అందించడం కోసం విదేశాల్లోని స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు స్వాతిలక్రా తెలిపారు. బాధితులు తమకు కేసులను పర్యవేక్షణ చేసుకునేలా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులు, నారీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ అమెరికా లాంటి స్వచ్ఛంద సంస్థలతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లోని భారత రాయభార కార్యాలయాల్లో ఎలా ఫిర్యాదు చేయాలి, కేంద్ర విదేశాంగ శాఖతో పాటు మహిళా కమిషన్ల నుంచి సహాయం ఎలా పొందాలన్న అంశాలపై ఇన్వెస్టిగేషన్‌ అధికారుల ద్వారా బాధితులకు సూచనలు, సలహాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ వివాహాలపై వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, కేసుల నమోదు, దర్యాప్తు వ్యవహారాల్లో అధికారులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు స్వాతిలక్రా వెల్లడించారు. కేసు నమోదు సమయంలో ఎలాంటి అంశాలను బాధితుల నుంచి తీసుకోవాలి, ఆ వివరాలను ఎలా పొందుపర్చాలన్న విషయాల్లోనూ దర్యాప్తు అధికారులకు తర్ఫీదునిస్తున్నామన్నారు.   

ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు... 
విదేశాల్లో భర్తలు మోసం చేసిన సందర్భాల్లో ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా కింది సంస్థలకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం సూచిస్తోంది.  
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు, జాతీయ మహిళా కమిషన్‌కు గృహ హింసపై ఫిర్యాదు చేయవచ్చు.  
- విచారణకు రాకపోతే విదేశాల్లోని భారత రాయభార కార్యాలయానికి కేసు వివరాలతో ఫిర్యాదు చేయవచ్చు.  
- విదేశాల్లో భర్త పనిచేస్తున్న కంపెనీకి కేసు వివరాలను పంపించి విచారణకు హాజరయ్యేలా చేయొచ్చు.  
- సహాయం కోసం విదేశాల్లోని స్వచ్ఛంద సంస్థలను సంప్రదించవచ్చు.
 

మరిన్ని వార్తలు