సిడ్నీ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలుగువాహిని సాహితీ సదస్సు

19 Sep, 2021 21:15 IST|Sakshi

సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని మూడవ సాహితీ సదస్సు అంతర్జాలంలో విజయవంతంగా ముగిసింది. ఐదు గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన సాహితీ సదస్సులో ముఖ్య అతిథులుగా వంగూరి చిట్టెన్ రాజు, ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి, డా. మూర్తి జొన్నలగడ్డ, రత్నకుమార్ కవుటూరి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మధు బైరెడ్డి ఇంకా పలువురు తెలుగువారు పాల్గొన్నారు. ఈ సాహితీ సదస్సులోనే పెయ్యేటి శ్రీదేవి కథల సంపుటి ''పిల్లలరాజ్యం' సామవేదం షణ్ముఖశర్మ అంతర్జాలంలో ఆవిష్కరించారు. శ్రీదేవి కథలపుస్తకంపై  భువనచంద్ర, డా. కె.వి. కృష్ణకుమారి తమ అభిప్రాయాలను తెలిపారు. 

గతంలో వెలువడిన 'బియ్యంలో రాళ్ళు'  'పిల్లలరాజ్యం'  ఇంటింట ఉండాల్సిన కథా పుస్తకాలని సామవేదం షణ్ముఖశర్మ అభిప్రాయపడ్డారు. పిల్లలరాజ్యం కథలపుస్తకం అంతర్జాతీయంగా మూడు దేశాలలో జూమ్ వేదికగా ఆవిష్కరణ కార్యక్రమం రూపొందించటం జరిగిందని తెలుగు వాహిని కన్వీనర్ విజయ గొల్లపూడి తెలిపారు. భారత్‌లో పిల్లలరాజ్యం కథల సంపుటిని సుధామ ఆవిష్కరించారు. పుస్తక పరిచయం గంటి భానుమతి చేయగా.. పెయ్యేటి శ్రీదేవితో ఆత్మీయ అనుబంధం గురించి పొత్తూరి విజయలక్ష్మి తెలిపారు. సిడ్నీలో మొదటి తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దుర్వాసుల మూర్తి, పలువురు ప్రముఖులు పెయ్యేటి శ్రీదేవి కథ శైలి, సునిశిత పరిశీలనా శక్తి, సామాజిక భాద్యతను కలిగిన చక్కని కథలని  కొనియాడారు.

తెలుగు వన్ గ్రూప్ అధినేత రవిశంకర్ కంఠమవేని శ్రీదేవి కథలు నాటికలుగా ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. కుమార్తెలు విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా నుంచి, కాంతి కలిగొట్ల అమెరికా నుంచి ఇంకా శ్రీదేవి భర్త పెయ్యేటి రంగారావు  పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత్రులు సంధ్య గొల్లమూడి, తమిరిశ జానకి, భావరాజు పద్మిని, బంధుమిత్ర సన్నిహితులు పాల్గొన్నారు. 26న జరగనున్నకెనడా అమెరికా సాహితీసదస్సులో  కూడా పిల్లలరాజ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని కాంతి కలిగొట్ల తెలిపారు.

మరిన్ని వార్తలు