‘తానా’ అంతర్జాతీయ కార్టూన్‌ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు

7 Dec, 2022 18:08 IST|Sakshi
కార్టూన్‌ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రసాద్‌ తదితరులు

విజయవాడలో కార్టూన్‌ పోటీల పోస్టర్ల ఆవిష్కరణ

సాక్షి, అమరావతి: తెలుగు భాష, తెలుగు కార్టూన్‌ కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు అంతర్జాతీయ కార్టూన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు ప్రసాద్‌ తోటకూర తెలిపారు. మంగళవారం విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో కార్టూన్‌ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిసారిగా తానా అంతర్జాతీయ తెలుగు కార్టూన్‌ పోటీలు–2023ను ఏర్పాటు చేసిందన్నారు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా కార్టూన్లు పంపాలని తెలిపారు. పోటీల్లోని ఎంట్రీల నుంచి 12 అత్యుత్తమ కార్టూన్లను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.5,000, మరో 13 ఉత్తమ కార్టూన్లకు గాను ఒక్కొక్కరికీ రూ.3,000 చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. 


ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు కార్టూనిస్టులు పోటీల్లో పాల్గొనవచ్చని, ఒక్కొక్కరి నుంచి మూడు కార్టూన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎంట్రీలను 300 రిజల్యూషన్‌ జేపీఈజీ ఫార్మేట్‌లో tanacartooncontest23@gmail.comకు ఈ నెల 26లోగా పంపాలన్నారు. ఫలితాలను జనవరి 15న సంక్రాంతి రోజు ప్రకటిస్తామని చెప్పారు. వివరాల కోసం 9154555675, 9885289995 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్, కలిమిశ్రీ, జాకీర్‌ పాల్గొన్నారు. (క్లిక్‌: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి)

మరిన్ని వార్తలు