New York : తానా సాహిత్య సదస్సు విజయవంతం

30 Jun, 2021 22:48 IST|Sakshi

న్యూయార్క్, జూన్ 27 తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జూన్ 27న జరిగిన వర్చువల్‌  సమావేశంలో “ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా విజ్ఞాన సదస్సు విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షలు జయశేఖర్ తాళ్లూరి తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ, పర్వ్యాప్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి తానా ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు. 
 
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ  “విద్యాలయాలలో విద్య ‘లయ’ తప్పుతోందని, పలు రాష్ట్రాలలో పాలకుల విద్యా విధానాలు శ్రుతి మించి ‘రోగాన’ పడుతున్నాయని, చాలా విశ్వవిద్యాలయాలలో తరచూ సిబ్బందిలో వచ్చే ఖాళీలను భర్తీ చేయకుండా, విద్యార్దులను ఇబ్బందికి గురి చేస్తున్నారని, భర్తీ చేసినా మొక్కుబడిగా వారిని తాత్కాలికంగా నియమిస్తూ, అరకొరా వేతనాలు ఇస్తూ భోదించే అధ్యాపకులే లేని అధ్వాన్న పరిస్థితులలోకి నెడుతున్నానారని, విద్యాలయాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వ విద్యాలయాలతో విశ్వానికే దిశానిర్దేశం చేసి మార్గదర్శకంగా నిలచిన మన భారతదేశంలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. 

విశాఖపట్నానికి చెందిన, ఆంధ్రవిశ్వవిద్యాలయం లో చదువుకున్న ఆచార్య డా. నీలి బెండపూడిఅమెరికా దేశంలో కెంటకీ రాష్ట్రంలో 223 సంవత్సరాల చరిత్ర, 120 కోట్ల రూపాయల వార్షిక ఆదాయ వ్యయం,3,000 కు పైగా సిబ్బంది, 22,000 మంది విద్యార్ధులకు నిలయమైన లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి)గా ఎన్నికగావడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయమంటూ డా. ప్రసాద్ తోటకూర ఆమెను ఈ సభకు ప్రత్యేక అతిధిగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి) ఆచార్య డా. నీలి బెండపూడి తెలుగు భాష మాధుర్యాన్ని, సాహిత్యపు విలువలని, ఎంతోమంది సాహితీవేత్తల కృషిని,అమెరికా దేశంలో గత 40 సంవత్సరాలుగా తానా చేస్తున్న కృషిని కొనియాడుతూ తాను ఏదేశంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, భారతీయురాలిగా, తెలుగు వ్యక్తిగా గుర్తించబడడం తనకు గర్వకారణం అంటూ ఈ సదస్సును ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. తంగెడ కిషన్రావు ఈ సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖాధ్యక్షులతో వేదిక పంచుకోవడం ఆనందదాయకంగా ఉందని, వివిధ సాహితీ సంస్థలు, సాహితీ ప్రియులు, తానా లాంటి పలు సంస్థలతో కలిసి పనిచేస్తూ తెలుగు విశ్వవిద్యాలయంలో అనేక జాతీయ, అంతర్జాతీయ తెలుగు సమావేశాలు నిర్వహించాలనే ఆసక్తి ఉన్నట్లుగా తెలియపరిచారు. తెలుగు భాష, సాహిత్యం, కళల అభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం విశేషంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉందని ప్రకటించారు.

మైసూరు విశ్వవిద్యాలయం, మైసూరు  పూర్వ తెలుగు శాఖాసంచాలకులు ఆచార్య డా. ఆర్.వి.ఎస్. సుందరం; ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు యోజన నిర్దేశకులు ఆచార్య డా. దిగుమర్తి మునిరత్నం నాయుడు;మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. విస్తాలి శంకర్ రావు; ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆలిఘర్ తెలుగు శాఖాధ్యక్షులు సహాయ ఆచార్యులు డా. పటాన్ ఖాసిం ఖాన్; మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, మధురై  తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. జొన్నలగడ్డ వెంకట రమణ; బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు  తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య డా. కొలకలూరి ఆశాజ్యోతి;  ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. గంప వెంకట రామయ్య; కర్ణాటక రాజ్య సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు తెలుగు శాఖాధిపతి ఆచార్య డా. మొగరాల రామనాథం నాయుడు; బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి తెలుగు శాఖాచార్యులు ఆచార్య డా. భమిడిపాటి విశ్వనాథ్ లు తమ తమ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖ ఆవిర్భావం, జరుగుతున్న అభివృద్ధి, తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యక్రమాలను, ప్రభుత్వాల నుండి ఇంకా అందవలసిన  సహాయ సహకారాల అవసరాలను సోదాహరణంగా వివరించారు. 

హాస్యావధాని, ప్రముఖ పాత్రికేయులు హాస్య బ్రహ్మ డా. టి. శంకర నారాయణ  తన హాస్య ప్రసంగంలో విశ్వనాధ సత్యనారాయణ, గుర్రం జాషువా, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీశ్రీ, ఆరుద్ర, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి లాంటి సాహితీవేత్తల జీవితాల్లోని హాస్య సంఘటలను వివరించి సభను నవ్వులతో ముంచెత్తారు. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా తానా నిర్వహిస్తున్న సాహితీ సమావేశాలతో పోల్చుకుంటే ఇదొక ప్రత్యేక సాహిత్య సమావేశమని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేయడంలో సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు