ఘనంగా తానా సౌత్ సెంట్రల్ మహిళా దినోత్సవ వేడుకలు

19 Mar, 2022 22:56 IST|Sakshi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' సౌత్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సాధికారతకు ప్రతిబింబం అనేలా ఘనంగా నిర్వహించారు. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలో తానా సౌత్ సెంట్రల్ ప్రాంతీయ సమన్వయకర్త కిషోర్ యార్లగడ్డ, మహిళా సమన్వయకర్త కిరణ్మయి బిత్ర మార్చి 11న ఈ వేడుకలను నిర్వహించారు.

స్థానిక హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకలను టెంపుల్ అధ్యక్షులు డాక్టర్ రాజ్యలక్ష్మి నాయుడు, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, 2017 తానా కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ కూర్మనాధ్ చదలవాడ.. స్థానిక తానా నాయకులు రాజా సూరపనేని, విజయ్ సాక్షి, మురళి పుట్టగుంట, ఏమాష్ గుత్త, కిశోర్ ఎరపోతిన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి 'బ్రేక్ ది బయాస్' అనే థీమ్‌తో ఈ వేడుకలు నిర్వహించడాన్ని అభినందించారు. అలాగే అన్ని విషయాలలోనూ మహిళలను ప్రోత్సహిస్తూ వారికి పెద్దపీట వేయడంలో తానా ఎప్పుడూ ముందుందన్నారు. వెంకట్ బిత్ర, కిషన్ బాగం, రామ్ కొల్లూరు, వెంకట్ గౌని, రామకృష్ణ కృష్ణస్వామి, నరేష్ అనతు మరియు నరేష్ జాస్తి రిజిస్ట్రేషన్ ఏరియాలో సహాయం చేసారు.

సుమారు 600 మంది పాల్గొన్న ఈ వేడుకలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అతిధుల ఉపన్యాసాలు, సరదా సరదాగా అట పాటలు, రాఫుల్ బహుమతులు, వైవిధ్యమైన శ్రీవారికి ప్రేమలేఖ, హెల్దీ కుకింగ్, పెయింటింగ్, నారీ శక్తి, ట్రెజర్ చెస్ట్, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సత్కరించారు.

వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి మరియు గాయకులు శ్రీకాంత్ సండుగు తమ ఆట పాటలతో ప్రేక్షకులతో మమేకమై ఆద్యంతం కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కొన్ని పాటలకు మహిళలందరూ డాన్స్ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. చివరిగా స్పాన్సర్స్ మరియు శ్రీనివాస్ పర్వతనేని, శేషు ఇంటూరి, మురళి పుట్టగుంట, రామ్మోహన్ పదురు, అలాగే హాజరైన మహిళామణులు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతంగా ముగించారు.

మరిన్ని వార్తలు