టాంటెక్స్‌ ఆధ్వర్యంలో తెలుగువెన్నెల సాహిత్య సదస్సు

24 Sep, 2020 14:56 IST|Sakshi

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 158వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు డల్లాస్‌లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ విచ్చేసి “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశం మీద మాట్లాడటం జరిగింది. ఈ మాసపు నెలనెలా తెలుగు వెన్నెల నవయుగ కవి, వైతాళికుడు గురజాడ అప్పారావు స్మరణతో ఆసాంతం నిండుగా సాగింది. గురజాడ వారి జయంతి ఈ మాసంలోనే ఉండడం వక్తలకు ఆ మహాకవి ఆశయాల పునఃచర్చపై ఉత్సాహాన్ని కలిగించింది.

ప్రారంభంలో  చిన్నారులు సాహితి , సిందూర  “శివుడు తాండవము సేయునమ్మా” అంటూ పరమేశుడి పై భక్తి గీతం పాడడం జరిగింది. ఎప్పూడూ చివరి అంశంగా ఉండే ప్రధాన వక్త ప్రసంగం ఈ మారు మొదటి అంశంగా ఉండడం ఒక విశేషమైతే అద్భుతమైన పాండిత్యంతో కూడిన  ప్రసంగాన్నందిన ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ ధాటి ఎన్నదగిన మరొక విశేషం. “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశం పై చర్చ చేస్తూ రవికుమార్ గురజాడ కేవలం వైతాళికుడే కాక, ముందు చూపు గలిగిన గొప్ప తాత్వికుడు అని గుర్తుచేయడం జరిగింది. సమకాలీన సమాజంలో పీడనకు గురైన స్త్రీ జాతిని మొదటగా జాగృతం చేసిన ఒక యోధుడుగా గురజాడ వారిని తలచుకోవడం జరిగింది.  

ఎప్పటివలెనే “మనతెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు,  పొడుపు కథల పరంపరను ఉరుమిండి నరసింహా రెడ్డి కొనసాగించారు. వాటికి తోడుగా తెలుగు సాహితీ జగత్తులోని ప్రసిద్ద కవితా పంక్తులను, కొన్ని ప్రహేళికలను ప్రశ్నలు జవాబుల రూపంలో సదస్యులందరినీ చర్చలో భాగస్వాములును చేయడం జరిగింది. ఉపద్రష్ట సత్యం పద్య సౌగంధం శీర్షికన మల్లిఖార్జున భట్టు విరచిత భాస్కరరామాయణంలోని చక్కని శార్దూల పద్యాన్ని అర్థతాత్పర్య సహిత విశేషాలతో వివరించడం జరిగింది.  సీతను చెరబట్టడం అతడి నాశనానికే అని హనుమంతుల వారు రావణుడికి చేసిన హెచ్చరికయే పద్యంలోని  సారాంశంగా ఉపద్రష్ట వారు వివరించారు.

జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, సెప్టెంబరు  మాసంలో జన్మించిన  తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. గురజాడ, జాషువా లాంటి ఎందరో మహనీయులు జన్మించిన మాసమిదని సుబ్రహ్మణ్యం సభకు గుర్తు చేశారు. చివరి రెండు అంశాలుగా లెనిన్ బాబు వేముల, మద్దుకూరి చంద్రహాస్ గురజాడ వారిని,  ప్రారంభ దశలో వారు రాసిన రచనలనూ, ఆంగ్ల సాహిత్యం పై వారి ప్రవేశాన్ని గురించి సహృదయంతో గుర్తు తెచ్చి నివాళులర్పించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ కృష్ణా రెడ్డి కోడూరు ముఖ్య అతిధి శ్రీ ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్కి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలకి, మిగిలిన వక్తలకి,విచ్చేసిన సాహిత్య అభిమానులకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక సాహిత్య ప్రియులు మాధవి రాణి, శశికళ పట్టిసీమ, విష్ణు ప్రియ, మాధవి ముగ్ధ ,శ్రీనివాస్ బసాబత్తిన, ప్రసాద్ తోటకూర, సురేష్ కాజా, చంద్రహాస్, ఆచార్యులు జగదీశ్వరన్ పూదూరు, ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి,  పూర్వాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు,తెలుగు, సునిల్ కుమార్,తవ్వా వెంకటయ్య ,సుబ్బ రాయుడు ,బసవ రాజప్ప తదితర్లు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు