డల్లాస్‌లో 160వ తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు

30 Nov, 2020 20:06 IST|Sakshi

డల్లాస్‌: ప్రతి ఏటా జరిగే ఈ మాసపు వెన్నెల (నవంబరు) ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 160వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డాలస్‌ నగర పరిధిలోని తెలుగు వారే కాకుండా ఆస్టిన్‌, టెక్సాస్‌ నగరాలకు చెందిన తెలుగు వారు సైతం హజరయ్యారు. సోమవారం జరిగిన ఈ సాహిత‍్య మాసపు సదస్సు ఎప్పటిలాగే చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల ‘తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ’ అనే రామదాసు కీర్తన ఆలాపనతో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మనుచరిత్ర-తాత్విక ప్రతీకాత్మకత అన్న అంశంపై ప్రసంగించారు. దీనిపై ఆయన పరిపూర్ణాభ్యాసం, విస్తారమైన సాహిత్య విశ్లేషణ నేపథ్యంలో ఆచార్యులు మనుచరిత్ర రచనపై లోతైన చర్చ చేశారు. అల్లసాని వారి కావ్యంలోని రహస్యాలనెన్నో విప్పి చెప్పి సాహిత్య విజ్ఞానాన్ని సభలో పంచుకున్నారు. భాషాశాస్త్రం, పదాల ఉత్పత్తి, భారతీయ ఇతర భాషా సాహిత్యాలు, తెలుగు సాహిత్య చరిత్ర లాంటి అంశాలపై వారికున్న లోతైన పరిచయాన్ని మనుచరిత్ర కావ్య విశ్లేషణకు సాధనాలుగా ఉపకరించాయి.

అల్లసాని వారు కథానాయకుడి పేరును ప్రవరుడుగా నామకరణం చేసిన నేపథ్యాన్ని ఆచార్యులు అద్భుతంగా సభలో అందరికి వివరించారు. చివరిలో ఆయన సత్‌చిత్ ఆనంద్ అనే పదాలు భారతీయ ఆధ్యాత్మిక చింతనాసరళికి ఏవిధంగా స్పష్టతను చేకూర్చాయో విశదీకరించారు. ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి జాతీయాలు, పొడుపు కథల పరంపరను కొనసాగించారు. తెలుగు సాహిత్య ప్రపంచంలోని ప్రసిద్ద కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సభకు హాజరైన వారిని చర్చలో భాగస్వామలు చేశారు. ఇక ఉపద్రష్ట సత్యం ‘పద్య సౌగంధం’శీర్షికన సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని పద్యాలను విశ్లేషించారు. పక్షి రాజు గరుత్మంతుడి శక్తిని విశ్వరూపదర్శనంగా చూపిన రాయల వారి కావ్యరచనలోని అర్థాలను, అలంకారాలను ఆయన చక్కగా వివరించారు.

అదే విధంగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ‘మాసానికో మహనీయుడు’ అనే శీర్షిక కొనసాగింపుగా, నవంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభలో గుర్తుకు తెచ్చారు. అనంతరం డాక్టర్ బల్లూరి ఉమాదేవి కార్తీక మాసవైశిష్ట్యాన్ని గుర్తు చేస్తూ.. వారు రాసిన స్వీయ పద్యకవితను పఠించారు. మరొక అంశంలో లెనిన్ బాబు వేముల కాళిదాస మహాకవి ఇప్పుడున్న భారతంలోని ఏ ప్రాంతపు వాడయి ఉంటాడో అన్న అంశంపై చర్చ  జరిపారు. ఈ సదస్సు చివరిలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు మాట్లాడుతూ.. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలతో పాటు మిగిలిన వక్తలకు, సభకు హజరైన సాహిత్య అభిమానులందరికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు