టాంటెక్స్ ఆధ్వ‌ర్యంలో సాహిత్య స‌ద‌స్సు

28 Jul, 2020 15:47 IST|Sakshi

డ‌ల్లాస్‌: ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌)  ఆధ్వర్యంలో 13వ సాహిత్య సదస్సు వార్షికోత్సవం  ఘనంగా జ‌రిగింది. 156వ "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సును వారాంతంలో డ‌ల్లాస్‌లో నిర్వహించారు. జూమ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డా.కె.గీతా మాధురి, శారదా కాసీవజ్జల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేములపల్లి శ్రీకృష్ణ రచించిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా" అనే ప్రార్థనా గీతంతో సాహితి, సింధూ ఈ కార్య‌క్ర‌మాన్ని ఆరంభించారు. అనంత‌రం డా.ఊర్మిండి నరసింహా రెడ్డి మన తెలుగు సిరిసంపదలు అనే జాతీయాలను, పొడుపు కథలను వివరించారు.

డాక్టర్ ఉపద్రష్ట సత్యం శ్రీకృష్ణదేవరాయల “ఆముక్త మాల్యద” ప్రబంధం నుండి – “పూచినమావులం దవిలి.. పరుమేలు తీరినన్” అన్నవసంతఋతు వర్ణన పద్యాన్ని భావయుక్తం గా చదివి అందులోని విశేషాలను వివరించారు.  ఆ పద్యంలో రాయలవారు “శ్రీచణుడు” అన్న అద్భుతమైన పదప్రయోగంతో ఆదిశంకరులవారి సౌందర్యలహరిలోని “ధనుః పౌష్పం... మనంగో విజయతే” అన్న ఒక శోభాయమానమైన శ్లోకాన్ని ధ్వనింపజేశారని చెబుతూ ఆ శ్లోక భావాన్ని రసవత్తరంగా విశదీకరించారు.  ఆ త‌ర్వాత‌ రాయలవారి ‘భువన విజయ’ సన్నివేశంలో నుంచి ఆణిముత్యం లాంటి తెనాలి రామకృష్ణుల “కలనన్ తావక ఖడ్గ ఖండిత... కృష్ణరాయాధిపా!" అన్న పద్యాన్ని రాగ, భావయుక్తంగా ఆలపించి, సందర్భసహిత వ్యాఖ్యానం చేసి సభికులను రంజింపజేశారు. ఇలాటి పద్యాలను మనం అప్పుడప్పుడు చదువుతుంటే వాటిల్లోని రసజ్ఞత పఠితలకు, శ్రోతలకు కూడా అద్భుతమైన జీవశక్తినందిస్తుందని ఉద్ఘాటించారు.

కర్నాటక సంగీత సంప్రదాయంలో త్రిముూర్తులుగా కొలవబడే ముగ్గురు వాగ్గేయకారులలో అగ్రజుడు శ్రీ శ్యామశాస్త్రి. రాశిలో తక్కువైనా వాసిలో మాత్రం గొప్పవిగా ఉండే కృతులను శ్యామశాస్త్రి వెలువరించారు. కంచి కామాక్షి అమ్మవారిపై వారు సృజించిన భైరవి రాగ  స్వరజతి విశేషాన్ని ఈ వేదిక‌పై లెనిన్ బాబు వేముల భావ సహితంగా స్తుతించారు. ఆ తర్వాత శారద కాసీవఝ్ఝల గారు మాతృ భాష మనుగడకు మనవంతు బాధ్యత అనే అంశం మీద మాట్లాడుతూ వ్యక్తులుగా, సమూహాలుగా, సంస్థలుగా, ప్రభుత్వాలు చేయవల్సిని బాధ్యతలని వివరించారు . 

156 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు  సందర్భంగా “దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు” అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన కె.గీత మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం అంటే అత్యంత తియ్యదనం, అనంతమైన అనుభూతి, అవధుల్లేని ప్రేమ, విహ్వల బాధ, అలవికాని వేదన మిళితమైన కరుణ రస మాధుర్యామృతం అని పేర్కొన్నారు. కృష్ణశాస్ర్తిగారు రాసిన ఏ పాట విన్నా రాసినప్పటి భావోద్వేగం అదే మోతాదులో శ్రోతల హృదయాల్లో కలగడం గమనార్హమని, పదాల్లోని కన్నీటి చెలమలు గుండె చాటు చెమ్మని అడుగడుగునా గుర్తుచేస్తాయని అన్నారు. ఆయన రాసిన అమృతవీణ వంటి సుమధుర గీతాల్ని, “కృష్ణపక్షము”, “మంగళ కాహళి” నుంచి భావ, అభ్యుదయ కవితల్ని సభకు పరిచయం చేశారు.

కృష్ణశాస్త్రి గారి లలిత గీతాల్లోని విలక్షణ పదజాలాన్ని, లాలిత్యాన్ని , సాహిత్య, సంగీత విశిష్టతల్ని పేర్కొనడమే కాకుండా, రసవత్తరంగా ఆలపిస్తూ చేసిన గీతగారి ప్రసంగం అంద‌రినీ విశేషంగా అలరించింది. తనకు సంగీతం, సాహిత్యం రెండుకళ్లుగా ఉగ్గుపాలతో అబ్బిన విద్యలుగా పేర్కొంటూ, అందుకు దోహదం చేసిన వారి మాతృమూర్తి, గురువు, ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మిగారికి సభాపూర్వకంగా నమోవాకాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది సాహిత్య ప్రియులు హాజరై సాహిత్య సదస్సును విజ‌యవంతం చేశారు. స్థానిక సాహిత్య ప్రియులకు, విచ్చేసిన ముఖ్య అతిథులు డా.కె.గీత, శారద కాసీవఝ్ఝలకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పోషక దాతలకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు