టీపీఏడీ అధ్వర్యంలో బ్లడ్‌ డ్రైవ్‌ కార్యక్రమం

15 Mar, 2021 15:43 IST|Sakshi

వాషింగ్టన్‌: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ తన 8 వ వార్షిక బ్లడ్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఎప్పటిలాగే ఈ కమ్యూనిటీ బ్లడ్‌ డ్రైవ్‌ కార్యక్రమంతో ఈ సంవత్సరానికి గాను తాము నిర్వహించే సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ బ్లడ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా రక్త దానం చేసేందుకు సుమారు 40 మంది నమోదు చేసుకున్నారు. టెక్సాస్‌లోని అతిపెద్ద రక్త కేంద్రాలలో ఒకటైన కార్టర్ బ్లడ్ కేర్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కార్టర్ బ్లడ్ కేర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘‘ఇక్కడ సేకరించిన ప్రతి పింట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఏడాది 30 యూనిట్ల రక్తం సేకరించాం. ఈ మొత్తం 90 మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.సేకరించిన 30 యూనిట్ల రక్తం, 5 గుండె శస్త్రచికిత్సలకు గాని.. 10 రక్త మార్పిడి వంటి అత్యధిక రక్తం వినియోగం అవసరం ఉన్న హెల్త్‌ సమస్యలకు సరిపోతుంది’’ అని తెలిపారు. 

టీపీఏడీ బృందం రక్తం దానం చేయడానికి వచ్చిన 40 మంది దాతలందరికీ అల్పాహారం, భోజనం అందించింది. స్థానిక ఐటీ కంపెనీ ఐటీ స్పిన్.. బ్లడ్ డ్రైవ్ నిర్వహించడానికి అవసరమైన పార్కింగ్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. బ్లడ్ డ్రైవ్‌ను లక్ష్మి పోరెడ్డి సమన్వయం చేయగా.. రావు కల్వాలా, మాధవి సున్‌కిరెడ్డి, రవికాంత్ మామిడియాండ్ గోలీ బుచి రెడ్డి మార్గనిర్దేశం చేయగా.. అనురాధ మేకల ప్రచారం చేశారు.

బ్లడ్ డ్రైవ్‌ కార్యక్రమంతో, టీపీఏడీ ప్రాణాలను కాపాడటంలో సహాయపడటమే కాకుండా, ఫ్రిస్కో, ప్లానో, అలెన్, కొప్పెల్‌కు చెందిన విద్యార్థులు, యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా టీపీఏడీ వలంటీర్లు మాట్లాడుతూ.. ‘‘స్థానికులకు సాయం చేయడం కోసం మా వంతుగా బ్లడ్‌ డ్రైవ్‌ నిర్వహించాం. ఇది మా బాధ్యత. ఇదే మద్దతుతో భవిష్యత్తులో బ్లడ్‌ డ్రైవ్‌ కార్యక్రమం ద్వారా మరింత మందికి సాయం చేసి.. వారి జీవితాల్లో ప్రభావం చూపుతాము’’ అని తెలిపారు. అంతేకాక రక్తం దానం చేసిన 40 మంది దాతలకు టీపీఏడీ కృతజ్ఞతలు తెలియజేసింది. 

మరిన్ని వార్తలు