తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 2021 క్రిస్మస్ సంబరాలు

6 Dec, 2021 19:42 IST|Sakshi

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) డిసెంబర్ 4న వర్చువల్ పద్థతిలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లండన్, యూకేలోని ఇతర ప్రాంతాల్లోని చర్చిలకు సంబంధించి సుమారు 100 మంది తెలుగువారు, తాల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ స్టీఫెన్ టీమ్స్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. 

గత 15 సంవత్సరాలకు భిన్నంగా తాల్.. గత ఏడాది, ఈ సంవత్సరం కోవిడ్19 ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తాల్ గురించి ప్రస్తావిస్తూ.. గత 16 సంవత్సరాల నుంచి తెలుగు భాష మరియు సంస్కృతిని లండన్‌లోని తెలుగు సమాజానికి అందించే సదుద్దేశంతో కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఈ క్రిస్మస్ సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రవి మోచర్ల, జమీమ రత్నాకర్ దార, జస్టిన్, కారోల్, డానియల్ విక్టర్ తదితరులను ప్రత్యేకంగా అభినందించారు. 

బ్రదర్ డేవిస్ పెనియల్ క్రిస్మస్ ఆరాధనతో కార్యక్రమం ఆరంభించారు. రెవరాండ్ పాల్, పాస్టర్ డొమినిక్, బ్రదర్ డానియల్ ఇతర చర్చి నాయకులు, పెద్దలు పాల్గొని యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు క్విజ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. లండన్, యూకే తదితర ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు.. వారి పిల్లలతో క్రిస్మస్ పాటలను పాడించి వీక్షకులను ఆనందపరిచారు.

ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా భారత దేశపు “కల్వరి లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్” నుంచి రెవరాండ్ డాక్టర్ జో మధు మరియు రెవరాండ్ డాక్టర్ వీణ జెస్సి పాల్గొన్నారు. కరోనా కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ వేడుకల్లో తాల్ ట్రస్టీలు నవీన్ గాదంసేతి, కిషోర్ కస్తూరి, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, అనితా నోములా తదితరులు తమ సహకారాన్ని అందించారు.


 

మరిన్ని వార్తలు