అమెరికాలో సిరివెన్నెలకి తెలుగు వారి నివాళి

7 Dec, 2021 13:33 IST|Sakshi

డాలస్ (టెక్సాస్‌): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆట, నాటా, నాట్స్, టీటీఏ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ  సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఘన నివాళి అర్పించాయి. డాలస్ లో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు సాహితి మిత్రులు సిరి వెన్నెలకి పుష్పాంజలి ఘటించారు. 

సిరివెన్నెల సంతాపసభలో మనమంతా కలుసుకోవడం బాధాకరమని తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన అన్నారు. సినీ, సాహిత్య రంగానికి సిరివెన్నెల చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

నాటా ఉత్తరాధ్యక్షులు డాక్టర్‌ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిలు మాట్లాడుతూ సిరివెన్నెల మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక మంచి రచయిత, సాహితీవేత్తని తెలుగు జాతి కోల్పోయిందన్నారు. 

తానా పూర్వాధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ చెంబోలు సీతారామశాస్త్రి  తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని తెలిపారు. అన్ని సమయాల్లో బావగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారని గతాన్ని నెమరు వేసుకున్నారు. తానా సంస్థతో సిరివెన్నెలకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

డాలస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే  ఉండేవారని సిరివెన్నెలకు సమీప బంధువు యాజి జయంతి చెప్పారు. తమ ఇంట్లో బస చేసినప్పుడే మురారి సినిమా పాటలు రాశారని చెబుతూ ఆనాటి  మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.

సిరివెన్నెలకు నివాళి అర్పించిన వారిలో శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డాక్టర్‌ ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చినసత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డాక్టర్‌ రమణ జువ్వాడి, యుగంధరాచార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డాక్టర్‌ కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డాక్టర్‌ విశ్వనాధం, పులిగండ్ల గీత, వేణు దమ్మన, ఎన్‌ఎంఎస్‌ రెడ్డి, బసివి ఆయులూరి తదితరులు ఉన్నారు. వీరంతా సిరివెన్నెలతో తమకున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు. చివరగా సిరవెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. 
 

మరిన్ని వార్తలు