బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

17 Jan, 2023 19:52 IST|Sakshi

బెర్లిన్: సంక్రాంతి పండుగను దేశదేశాల్లోని తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సంక్రాంతి పర్వదినాన్ని తెలుగువారు సంప్రదాయబద్దంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టాగ్‌) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ ఆలయంలో  జరిగిన ఈ వేడుకలకు భారత రాయబారి పర్వతనేని హరీష్‌, ఆయన సతీమణి నందిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఆట పాటలతో సాగిన వేడుకల్లో పిల్లాపాపలతో కలిసి పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు.


అమికల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజనా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శార్వరి పనంగిపల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన, సర్వాణి గురజాడ శాస్త్రీయ గానం సభికులను అలరించాయి. పిల్లల కోసం డ్రాయింగ్‌ పోటీలు.. మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. 


ఈ సందర్భంగా పర్వతనేని హరీష్‌ మాట్లాడుతూ.. బెర్లిన్‌లో సంక్రాంతి సంబరాలు జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వారికి దౌత్యపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. వేడుకల నిర్వహణలో మద్దతుగా నిలిచిన శివమ్ భాయ్, కృష్ణ మూర్తి, జైరాం నాయుడు, శ్రీనివాస్‌లకు ‘టాగ్‌’ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.


‘టాగ్‌’ అధ్యక్షుడు  డాక్టర్‌ రఘు చలిగంటి, ఉపాధ్యక్షుడు రామ్ బోయినపల్లి, కార్యదర్శి అలేఖ్య భోగ, కోశాధికారులు బాల్‌రాజ్ అందె, యోగానంద్ నాంపల్లి, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ కమిడి, నరేష్ తౌతం, సోషల్ మీడియా సెక్రటరీలు శ్రీనాథ్, శివరామ్.. కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. (క్లిక్ చేయండి: వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు)

మరిన్ని వార్తలు