వర్చువల్‌గా కళాభారతి జమున 85వ జన్మదిన వేడుకలు

5 Sep, 2021 18:16 IST|Sakshi

ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ (85)వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన వర్చువల్‌గా సమావేశంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీ గారు ఆశీర్వదిస్తూ నేను జమున గారి అభిమానిని ఆ రోజుల్లో జమున గారి సినిమా వస్తుందంటే చాలు ఎదురు చూసి మరీ రాగానే వెళ్ళిపోయేదాన్ని. జమున గారి కట్టు బొట్టు ఎంత సంప్రదాయికంగా ఉండేవో అభినయం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే నాకు నూరు సంవత్సరాల వయసులో జమున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు చాల సంతోషంగా ఉంది.

అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. జమున గారు ప్రతిగా అంత పెద్దావిడ వచ్చి తనను ఆశీర్వదిస్తుంటే స్వయంగా పింగళి వెంకయ్య గారే వచ్చి ఆశీర్వదించినంత ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి(USA) జమున గారికి డాక్టర్ సీ నారాయణరెడ్డి స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. దర్శకులు కె. విశ్వనాధ్ గారు ఆశీర్వదిస్తూ జమునా, నీకు 85వ పుట్టినరోజంటే నమ్మలేకుండా ఉన్నాం. ఇప్పుడే, నిన్నగాక మొన్న పెద్దమనిషివై నటనలో సత్యభామ లాగా ఇంకా మా కళ్ళ ముందర కనిపిస్తున్నావు. నీకు ఇంత తొందరగా వయస్సు వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. నా శుభాకాంక్షలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. క్షేమంగా ఉండి, ఇంకా ఒక యాభై ఏళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను, సెలవు అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ(85)వ జన్మ దినోత్సవం అంతర్జాలంలో ఐదు(5) ఖండాలలోని ముప్పై(30) కళాసమితుల సహకారంతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా మరియు తెలుగు కళా సమితి ఖతార్ కలిసి పదహారు(16) గంటలుఅత్యంత అద్భుతంగా జరిగింది. వంశీ రామరాజు మాట్లాడుతూ జమునకు డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ఆ సందర్భంగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి మెగా సంగీత విభావరి సమర్పించనున్నారని తెలిపారు. పదహారు (16) గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమంలో 30 దేశాల నించి 200 మందికి పైగా కవులు కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు. ఈ కార్యక్రమాన్ని తాతాజీ ఉసిరికల నిర్వహించారు.

మరిన్ని వార్తలు