వలస కార్మికుల హక్కులపై వర్క్‌షాప్‌, టీపీసీసీ నాయకులకు ఆహ్వానం

16 Nov, 2022 13:39 IST|Sakshi

అంతర్జాతీయ కార్మిక చట్టాలపై బీడబ్ల్యుఐ సంస్థ ఈనెల 17, 18 రెండు రోజుల పాటు చెన్నైలో నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు తెలంగాణకు చెందిన ఇద్దరు యువ నాయకులకు ఆహ్వానం అందింది. చట్టపరమైన న్యాయవాద శిక్షణ - వలస కార్మికుల హక్కులు  (లీగల్ అడ్వకసీ ట్రైనింగ్ - మైగ్రంట్ వర్కర్స్ రైట్స్) శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం (టీపీసీసీ ఎన్నారై సెల్) గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి హాజరవుతున్నారు.    

స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యుఐ)  అనే గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్ తన సభ్య యూనియన్ జగిత్యాల జిల్లాకు చెందిన 'ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్' కు ఈ ఆహ్వానం అందజేయగా ఇద్దరు యువ నాయకులను నామినేట్ చేసింది. 127 దేశాలలో 351 ట్రేడ్ యూనియన్‌ లతో ఒక కోటి 20 లక్షల సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిడబ్ల్యుఐ భారతదేశంలో దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నది. 

అంతర్జాతీయ వలసలు, గల్ఫ్ దేశాలలో వలస కార్మికుల హక్కులు అనే అంశంపై చెన్నయిలో శిక్షణ ఇస్తారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకుల జ్ఞానం పెంపొందించడానికి, నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. 

ఈ క్రింది అంశాలపై శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ వలసలను నియంత్రించే చట్టపరమైన విధాన నమూనా (పాలసీ ఫ్రేమ్‌ వర్క్‌) వ్యవస్థ భాగస్వాముల అవగాహనను విస్తరించడం. వలస కార్మికుల హక్కులను నిలబెట్టడానికి, సురక్షితమైన వలసలను ప్రోత్సహించడానికి భాగస్వామ్య సంఘాల జోక్యాలపై నవీకరణలు మరియు సురక్షిత సమాచారాన్ని సేకరించడం. కంట్రీస్ ఆఫ్ ఆరిజిన్ (కార్మికులను పంపే మూలస్థాన దేశాలు) మరియు కంట్రీస్ ఆఫ్ డెస్టినేషన్ (కార్మికులను తీసుకునే గమ్యస్థాన దేశాలు) లలో వలస కార్మికులకు  అందుబాటులో ఉండి వారికి సహాయాన్ని అందించడానికి కార్మిక సంఘాలు (ట్రేడ్ యూనియన్స్) ఎలాంటి  కార్యాచరణ, వ్యూహాలను కలిగి ఉండాలో చర్చిస్తారు.
 

మరిన్ని వార్తలు