-

అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం

20 Jun, 2022 14:23 IST|Sakshi
అమెరికాలో జరిగిన కల్యాణోత్సవంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు

భక్తిపారవశ్యంతో పులకించిన భక్తులు

తిరుమల: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా తొలుత అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ అయిన పుణ్యాహవాచనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి ఆరాధనను చేపట్టారు. తరువాత కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమగుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. 

అనంతరం వైదిక క్రతువు అయిన అంకురార్పణలో భాగంగా అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. వేద మంత్రాల నడుమ ప్రతిష్టా బంధన నిర్వహించారు. ప్రాయశ్చిత హోమం నిర్వహించి దేవతామూర్తలకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం చేపట్టారు. చివరిగా శ్రీదేవిని కుడి వైపున, భూదే విని ఎడమ వైపున కూర్చోబెట్టి స్వామివారికి కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి ఇవ్వడంతో కల్యాణోత్సవం ముగిసింది. 

ఈ ఘట్టాలను తిలకించి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్‌ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు