ఘనంగా సిలికానాంధ్ర ఉగాది వేడుకలు

5 Apr, 2022 08:46 IST|Sakshi

కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర నిర్వహించిన శుభకృత్ నామ ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందల సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలకు భారతదేశంనించి ప్రత్యేకంగా తెప్పించిన వేపపువ్వుతో  చేసిన ఉగాదిపచ్చడితో అందించిన ఆహ్వానం పలికారు నిర్వాహకులు. అనంతరం మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదపఠనంతో కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా రాబోయే ఏడాది ఫలితాలను తమ పంచాంగపఠనంతో వివరించారు.

 

ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ జనరల్ టీ నాగేంద్రప్రసాద్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. భారత కాన్సులేట్ ప్రవాసీయులకోసం చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. సిలికానాంధ్ర శ్రేయోభిలాషి, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర భవన తొలిదాత లక్కిరెడ్డి హనిమిరెడ్డి  యూనివర్సిటీ భవిష్యత్ కార్యాచరణకు మొదటి విరాళం సభా ముఖంగా ప్రకటించారు. సభకు హాజరైన ప్రముఖ వైద్యులు  వేణు ,  ప్రభాకర్ కల్వచర్లలు అందరికి  ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు. పద్మ తన కవితలు వినిపించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు  ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంలో సిలికానాంధ్ర నవతరం నాయకులను, కార్యకర్తలను సభికులకు పరిచయం చేశారు. 

మధుబాబు ప్రఖ్య గారి సంచాలకత్వంలో ప్రాంతీయ తెలుగుకవుల స్వీయ కవితాపఠనం జరిగింది. దీనిలో  స్వాతి చీమకుర్తి , వంశీకృష్ణ ప్రఖ్య గారు, రావు తల్లాప్రగడ, మారేపల్లి వేంకటశాస్త్రిలు పాల్గొన్నారు. శ్రీ రావు తల్లాప్రగడ వినూత్నంగా చిరంజీవి అమోఘ్ కూచిభొట్ల మృదంగ వాద్య సహకారంతో చేసిన కవితాగానం,  మధు ప్రఖ్య ఛలోక్తులు సభికులను అమితంగా ఆకట్టుకున్నాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పది పాటలను ఎంచుకొని పిల్లలతో కలిసి పాడారు. 

కార్యక్రమం చివర్లో దిలీప్ కొండిపర్తి దర్శకత్వంలో, ప్రదర్శించిన  ఆదుర్దా వద్దు, ఆనందం ముద్దు నాటకం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. శ్రీనివాస్ ప్రభల రచించిన ఈ నాటికలో రామకృష్ణ కాజా, కాత్యాయని ధూళిపాళ్ళ, అనిల్ చింతలపాటి,  దీనబాబు కొండుభొట్లలు వివిధ పాత్రలు పోషించారు. దిలీప్ కొండిపర్తి ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటూ, ఉగాది సందర్భంగా పిల్లలకు నిర్వహించిన భాషా వికాస పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. 
 

మరిన్ని వార్తలు