సరిహద్దు ఉద్రిక్తత.. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు అలర్ట్‌! ఇలా చేయండి..

26 Jan, 2022 18:28 IST|Sakshi

Alert For Indians In Ukraine: ఉక్రెయిన్‌కు రష్యా ముప్పు పెరిగిపోతుండడంతో.. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించి.. రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. ఉక్రెయిన్‌ సరిహద్దులో రష్యా సైన్యం, ప్రతిగా నాటో బలగాల మోహరింపుతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రాజధాని కియెవ్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు కీలక సూచన చేసింది.

పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్‌డేట్‌ చేయాలంటూ భారత పౌరులను కోరింది. ‘‘భారత పౌరులతో వేగంగా సమన్వయం కావాలన్న ఉద్దేశంతో భారత రాయబార కార్యాలయం ఉంది.

కాబట్టి, పౌరులు ముఖ్యంగా  ఉక్రెయిన్‌ సరిహద్దులోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఫామ్‌ను నింపండి. ఒకవేళ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ఆప్షన్‌తో భారత్‌కి వెళ్లిపోయిన విద్యార్థులు మాత్రం ఈ ఫామ్‌ నింపాల్సిన అవసరం లేదు.. అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది ఎంబసీ. మరింత అప్‌డేట్స్‌ కోసం ఎంబసీ వెబ్‌సైట్‌తో పాటు ఫేస్‌బుక్‌, ట్విటర్‌ పేజీలను ఫాలో కావాలని, ఏవైనా సాయం కావాలంటే సోషల్‌ మీడియాలోనూ సంప్రదించవచ్చని సూచించింది. 

ఒకవైపు రష్యా ఆక్రమణ కోసం ప్రయత్నిస్తోందంటూ ఉక్రెయిన్‌తో పాటు అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తూనే తమకు అలాంటి ఉద్దేశం లేదంటూ రష్యా బుకాయిస్తోంది. 

అసలు కథ.. 
సుమారు మూడు దశాబ్ధాల కిందట రష్యా నుంచి విడిపోయింది ఉక్రెయిన్‌. అటుపై కొన్నేళ్లకు(2014లో) యూరప్‌తో ఒప్పందాలను తెంచుకొని రష్యాతో బంధం బలపరుచుకోవాలని భావించింది. కానీ, అది కుదర్లేదు. పైగా ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లడంతో రష్యా ఆగ్రహంతో  ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన హింసాకాండతో రష్యాపై వ్యతిరేకత కారణంగా పాశ్చాత్య దేశాల ఉక్రెయిన్‌ ఆకర్షితురాలైంది. ఈ నేపథ్యంలో 2024లో యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని, నాటోలో చేరాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది రష్యాకు మరింత కోపం తెప్పించింది.  సాంస్కృతికంగా రష్యాతోనే ఉక్రెయిన్‌కు మంచి సంబంధాలున్నాయని చెబుతూ.. నాటో, ఈయూలో చేరడం కన్నా తమతో కలిసిపోవడం మేలంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. అందుకే సరిహద్దులో సైన్యం మోహరింపు ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ విషయంలో తాము తొందరపడకూడదంటే అమెరికా, మిత్రపక్షాలు కొన్ని హామీలివ్వాలని.. ముఖ్యంగా నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకుండా ఉండడం, తూర్పు యూరప్‌లో నాటో బలగాల ఉపసంహరణ లాంటి డిమాండ్లు చేస్తోంది. కానీ, అగ్రరాజ్యం అందుకు అంగీకరించడం లేదు.

చదవండి: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?!

మరిన్ని వార్తలు