అమెరికాలో విచిత్ర ఘటన.. ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్టుగా..

31 Jan, 2022 13:49 IST|Sakshi

ఉత్తర అమెరికా చలి గుప్పిట్లో చిక్కుకుని గజగజ వణికిపోతుంది. చలి గాలుల తీవ్రత, మంచు తుఫాను దాటికి జనజీవనం స్థంభించి పోయింది. సుమారు 1400 ఫ్లైట్లు రదయ్యాయి. రోడ్ల మీదికి వాహనాలతో రావొద్దంటూ ఎమర్జెన్సీ ప్రకటించాయి పలు రాష్ట్రాలు. స్నోస్ట్రోమ్‌ ఎఫెక్ట్‌తో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో ఇగ్వానస్‌ అనే ఉసరవెల్లి తరహా జీవులు సజీవ శవంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ప్రాణంతో ఉన్నా శవాల్లా పడిపోతున్నాయి. దీంతో యూఎస్‌ వాతావరణ శాఖ అక్కడి ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేసింది.

శవాల్లాగే
ఇగ్వానస్‌ శరీరంలో చల్లని రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత్తలు మైనస్‌ 4 సెల్సియస్‌ డిగ్రీల నుంచి మైనస్‌ 10 సెల్సియస్‌ డిగ్రీల మధ్య ఉంటే ఇవి తట్టుకోలేవు. ఉన్న పళంగా అచేతనంగా మారిపోతాయి. ప్రాణం పోదు కానీ చచ్చిన శవంలా ఎక్కడివక్కడే సుప్త చేతనావస్థ స్థితికి చేరుకుంటాయి. ఈ పరిస్థితి కారణంగా ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో రోడ్ల మీద ఇళ్ల పక్కన, పార్కుల్లో ఇవి ఎక్కడ పడితే అక్కడ చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క సారి ఉష్ణోగ్రత పెరిగితే ఇవి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి హానీ తలపెట్టవద్దంటూ స్థానిక అధికారులు సూచిస్తున్నారు. 

ఇక్కడివి కాదు
జీవవైవిధ్యం కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇగ్వానస్‌లను ఫ్లోరిడాకి తీసుకువచ్చని జీవ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గటుగా అవి ఇంకా పూర్తిగా ఎవాల్వ్‌ కాలేదని చెబుతున్నారు. అందువల్లే ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు అవి అచేతన స్థితికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు. అతిశీతల పరిస్థితులకు అలవాటు పడ్డ ద్రువపు ఎలుగుబండ్లు ముందుగానే అనువైన చోటు ఎంపిక చేసుకుని సుప్తచేతనావస్థ స్థితిలోకి వెళ్తాయంటున్నారు. 

గతంలో
పూర్తిగా ఎదిగిన ఇగ్వౌనస్‌ సుమారు 1.5 మీటర్ల పొడవుతో 7.5 కేజీల బరువు వరకు పెరుగుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఉత్తర అమెరికాలో 2010లో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ఇగ్వౌనస్‌లు ఇదే తరహా ప్రమాదం ఎదుర్కొన్నాయి.. ఇవి చనిపోయినట్టుగా ప్రజలు భావించడంలో.. ఆ ఏడాది ఇగ్వౌనస్‌లు పెద్ద మొత్తంలో తుడిచిపెట్టుకుపోయాయి. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని.. ప్రజలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు