అమెరికాకు భారత్‌ మామిడి ఎగుమతులు

12 Jan, 2022 13:02 IST|Sakshi

తదుపరి సీజన్‌కు లభించిన అనుమతి 

కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన  

న్యూఢిల్లీ: రానున్న సీజన్‌లో మామిడి కాయలను / పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతి లభించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) ఈ మేరకు అనుమతి మంజూరు చేసినట్టు తెలిపింది. భారత్‌ నుంచి వచ్చే మామిడిని అమెరికా 2020 నుంచి నియంత్రిస్తోంది. యూఎస్‌డీఏ అధికారులు భారత్‌కు వచ్చి ఇర్రేడియం సదుపాయాలను తనిఖీ చేసే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే 2021లో వ్యవసాయ శాఖ, రైతుల సంక్షేమ సంఘం యూఎస్‌డీఏతో ఒప్పందం చేసుకున్నాయి. దీని కింద భారత్‌ నుంచి వచ్చే మామిడి, దానిమ్మ ఉత్పత్తులకు.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే చెర్నీ, అల్ఫల్ఫాకు ఉమ్మడి ఇర్రేడియేషన్‌ ప్రోటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది.

‘‘ఉమ్మడి ఒప్పందం కింద మార్చి నుంచి ఆల్ఫాన్సో రకం మామిడి కాయలను అమెరికాకు ఎగుమతి చేసుకోవచ్చు’’ అని వాణిజ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వద్దనున్న గణాంకాల ప్రకారం.. 2017–18లో భారత్‌ 800 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేసింది. 2018–19లో 951 మెట్రిక్‌ టన్నులు, 2019–20లో 1,095 టన్నుల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రానున్న సీజన్‌లో 2019–20 కంటే ఎక్కువ ఎగుమతులు సాధ్యమవుతాయని వాణిజ్య శాఖ తెలిపింది.
 

చదవండి: మొదటి 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' కార్డు గ్రహీత మన హైదరాబాదీ! 

మరిన్ని వార్తలు