Veena Reddy: ఆ ఘనత సాధించిన భారత సంతతి తొలి వ్యక్తిగా..

27 Jul, 2021 14:04 IST|Sakshi

అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్‌ డైరెక్టర్‌గా వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్‌ పేజీ ద్వారా అధికారికంగా ప్రకటించింది. 

కాగా, యూఎస్‌ఏఐడీ(USAID) మిషన్‌ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి ఇండియన్‌-అమెరికన్‌ వ్యక్తి వీణా రెడ్డి కావడం విశేషం. ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సందూ, వీణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలం ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్‌ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె తన సత్తా చాటారు.

ఈ పదవుల కంటే ముందు వాషింగ్టన్‌లో అసిస్టెంట్‌ జనరల్‌ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఆమె పని చేశారు. ఇక ప్రభుత్వ సర్వీసుల కంటే ముందు న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, లండన్‌లో కార్పొరేట్‌ కంపెనీలకు అటార్నీగా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్‌ డాక్టరేట్‌’(జేడీ) అందుకుంది. న్యూయార్క్‌, కాలిఫోర్నియా బార్‌ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వం ఉంది.

మరిన్ని వార్తలు