ఒమన్‌లో చిక్కుకున్న భారతీయ మహిళ.. రంగంలో దిగిన విదేశాంగ శాఖ

19 Jan, 2022 12:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ట్రావెల్‌ ఏజెంట్లు చేసిన మోసంతో ఓ మహిళ దేశం కాని దేశంలో ఇక్కట్ల పాలైంది. చేతిలో డబ్బులు లేక అక్కడ యజమాని పెట్టే కష్టాలు భరించలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూసింది. చివరకు విదేశాంగ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ మహిళకు అండగా నిలిచారు. 

మారుమూల ప్రాంతానికి
మస్కట్‌లో ఉద్యోగం ఉందంటూ మాయమాటలు చెప్పిన ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ రంగారెడ్డి జిల్లాలోని షహీన్‌ నగర్‌కి చెందిన ఓ మహిళను విమానం ఎక్కించాడు. మస్కట్‌కి కాకుండా ఒమన్‌లోని మారుమూల ప్రాంతమైన సిర్‌కి ఆ మహిళను పంపాడు. అక్కడ ఉద్యోగం బదులు ఒకరి ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు. ఈ ఘటన 2021 నవంబరులో జరిగింది. 

నిత్యం హింసే
రోజుకు 18 గంటల పాటు పని చేసినా యజమాని సంతృప్తి చెందకపోవడంతో నిత్యం ఆమెను హింస పెట్టేవాడు. దీంతో తనను ఇండియా పంపివ్వాలంటూ ఆ మహిళ వేడుకోగా.. తనకు రెండు లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తే తప్ప విముక్తి లేదంటూ ఖరాఖండీగా ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఫోన్‌ ద్వారా జరిగిన మోసం కుటుంబ సభ్యులకు తెలిపింది.

నిఘా పెట్టాలి
ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థల ద్వారా విదేశాంగ శాఖ  దృష్టికి తీసుకెళ్లారు. మస్కట్‌, ఒమన్‌లలో ఉన్న భారత అధికారులు.. సదరు యజమానితో మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపారు. చివరకు 2022 జనవరి 18న ఆ మహిళ సురక్షితంగా ఇండియా చేరుకుంది. ట్రావెల్‌ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీసారి సరైన సమయంలో సహాయం అందకపోవచ్చని.. కాబట్టి చిక్కుల్లో పడవద్దంటూ సూచించారు. ట్రావెల్‌ ఏజెంట్ల ముసుగులో హుమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.  
 

చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టు డ్రోన్‌ ఎటాక్‌.. యూఏఈ స్పందన

మరిన్ని వార్తలు